మాట్లాడుకుంటే చాలు చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయని అంటుంటారు. కానీ ఇక్కడ మాటలే సమస్యలు మూల కారణం అవుతున్నాయి. ఆ విధంగా గన్నవరం రాజకీయం వేడెక్కిపోతోంది. సీఎం జగన్ చొరవ తీసుకుని వేడిని తగ్గించే ప్రయత్నం ఒకటి మళ్లీ చేశారు. కానీ అది ఎంత మేరకు ఫలితం ఇస్తుందో అన్నదే ఆసక్తికరం. ముఖ్యంగా గన్నవరంలో రెండు వర్గాల కొట్లాట కారణంగా వైసీపీ ఎదుగుదల అన్నది కొంత ఆగిపోతోంది అని తెలుస్తోంది. ఇంత కాలం వంశీ చేసిన సాయంను వద్దని ఇప్పుడు వైసీపీ ఆయన్ను కాదని ఉండలేదు. ఆ విధంగా జగన్ కాదు కదా ఎవ్వరూ ఉండలేరు అని పరిశీలకులు అంటున్నారు.
ఎందుకంటే వంశీ మాటల కారణంగానే టీడీపీ అధినేతను అసెంబ్లీ వేదికగా కూడా నిలువరించగలిగారు అన్నది ఓ వాస్తవం అని, ఆ రోజు బాబుకు దగ్గరగా ఉన్న వ్యక్తుల తిరుగుబాటు కారణంగానే కాస్తో కూస్తో ప్రజా క్షేత్రంలోనే కాదు, చట్ట సభల్లోనూ నెగ్గుకు రాగలిగాం అన్నది జగన్ కు చేరువగా ఉండే అభిమాన వర్గాల అంతర్గత అభిప్రాయం.
కానీ ఇప్పుడిప్పుడే సీన్ రివర్స్ అవుతోంది. వంశీని నిలువరించే శక్తిని కూడదీసుకునేందుకు యార్లగడ్డ, దుట్టా వర్గీయులు ప్రయత్నిస్తున్నారు అన్న వాదనలు మీడియా ముఖంగా వినిపిస్తూ వస్తున్నాయి. కనుక వీటిపై జగన్ ఓ క్లారిఫికేషన్ పొంది వాళ్లను పిలిచి మాట్లాడేందుకు మరికొంత సమయం వేచి ఉంటారన్న వాదన కూడా ఉంది. ప్రస్తుతానికి అంతా కలిసి పనిచేసుకోండి అని చెప్పినా ఆ మాట పాటింపు లేదా ఆచరణ చెప్పినంత సులువు కాదు. కనుక ఇకపై ఉండే పరిణామాలు వైసీపీకి ఎంతో కీలకం. మరోవైపు పేర్నినాని, బాలశౌరి వర్గాలు కూడా మచిలీపట్నం కేంద్రంగా వివాదాలు పడుతున్నాయి. వీటిపై కూడా దృష్టిసారించారు. ఇరువురు నేతలకూ తగ్గి ఉండాలని చెప్పారు అని ప్రాథమిక సమాచారం.
ఇక్కడ కూడా జగన్ చెప్పిన విధంగా జరగుతుందా ? ఆయన చెప్పినంతనే ఎస్..బాస్ అని ఇరువురు నాయకులూ తగ్గి రాజకీయం చేస్తారా ? అన్నది కూడా ఓ డౌటేనని పరిశీలకులు అంటున్నారు. ఏదేమయినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో అభివృద్ధి కన్నా కీచులాటలకే ఎక్కువ సమయం వెచ్చింపు చేస్తున్నారని ఇది ప్రజా క్షేమానికి మంచిది కాదనే ఓ వర్గం అభిప్రాయం.