ఏపీలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సొంత పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ నడుస్తోంది. దీని వల్ల వైసీపీకి ఇబ్బంది అవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా సరే కొన్ని సీట్లలో నేతలు పోటీకి వస్తున్నారు. ఎందుకంటే పనితీరు బాగోని వారికి సీట్లు ఇవ్వనని జగన్ తేల్చేశారు. కాబట్టి ఆ సీట్లని దక్కించుకోవాలని కొందరు వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సత్తెనపల్లె సీటు కోసం పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి అంబటి రాంబాబు ఉన్న విషయం తెలిసిందే. అంబటి సొంత నియోజకవర్గం ఇది కాదు..1989 ఎన్నికల్లో అంబటి కాంగ్రెస్ నుంచి రేపల్లెలో గెలిచారు. అప్పుడు తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో సత్తెనపల్లె నుంచి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో అంబటి సత్తెనపల్లె బరిలో ఓటమి పాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచారు.
ఇక రెండో విడతలో మంత్రి అయ్యారు..అయినా సరే సత్తెనపల్లెకి చేసేదేమీ కనిపించడం లేదు. కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రం వస్తున్నాయి. ఈ పథకాల మీద ఆధారపడి బండి లాగించడం కష్టం. పైగా అంబటిపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో ఆయనకు నెక్స్ట్ గెలుపు అవకాశాలు కష్టమవుతున్నాయని సర్వేలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీటు కోసం మరో వైసీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ట్రై చేస్తున్నారు.
సత్తెనపల్లి అనాథ బిడ్డ కాదని, ఎవరెవరో వచ్చి సంపాదించుకు వెళ్తున్నారని అంబటిని టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. బయట వ్యక్తుల పెత్తనాన్ని నియోజకవర్గంలో సహించేది లేదని, దీనివల్ల ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, 2024 ఎన్నికల్లో తాను అసెంబ్లీ టికెట్ కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు అంబటికే కాదు..వైసీపీకి ఇబ్బందిగా మారాయి. అదే సమయంలో టిడిపి-జనసేన గాని కలిసి పోటీ చేస్తే సత్తెనపల్లెలో వైసీపీకి షాక్ తప్పదు.