మామకే కాదు.. మాజీ ప్రధాని వాజ్‌పేయికీ చంద్రబాబు వెన్నుపోటు: అమిత్‌షా

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విరుచుకుపడ్డారు. చంద్రబాబు పెద్ద మోసకారని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి కేంద్రం ఎంతో సాయం చేస్తున్నదని.. కానీ.. దాన్ని కప్పిపుచ్చి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ప్రజల్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. చివరకు పుల్వామా దాడిని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

Amit shah fires on ap cm chandrababu

పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం చంద్రబాబుకు మన దేశ ప్రధానిపై లేదని ఎద్దేవా చేశారు. ఉగ్రదాడిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న చంద్రబాబును ఏం చేయాలో ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఇవాళ ఏపీలోని రాజమండ్రిలో అమిత్‌షా పర్యటించారు. అర్బన్ జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం మాట్లాడిన అమిత్‌షా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

తన మామ ఎన్టీఆర్‌నే కాదు… మాజీ ప్రధాని వాజ్‌పేయిని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని మోదీని మోసం చేయాలని చూస్తున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీ, కోల్‌కతా వెళ్లి ధర్నాలు చేయడం కాదు.. ఆయన పార్టీ కార్యాలయం ముందే ధర్నా చేయాలని అమిత్ షా హితువు పలికారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. వాటిని ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోపించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాల్లో దాదాపు 90 శాతం నెరవేర్చామన్న షా.. గత ఐదేళ్లలో 20 ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news