కమలం చేతిలో కీలక అస్త్రం… ’షా’ ఇన్ యాక్షన్.. కేసీఆర్‌కు బొమ్మేనా!

ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం మొదలైందో అప్పటినుంచే కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడం మొదలుపెట్టారు. పైగా ఈటల రాజేందర్ లాంటి నాయకుడుని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్‌ని చిత్తుగా ఓడించడంతో కేసీఆర్‌కు కాస్త టెన్షన్ మొదలైందనే చెప్పాలి. అక్కడ నుంచి బీజేపీని ఎలా ఇరుకున పెట్టాలనే దిశగా పనిచేస్తూ వెళుతున్నారు. నిజానికి చెప్పాలంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది..కానీ బీజేపీ ఎదుగుదల స్పీడ్‌గా ఉంది…అటు కేంద్రంలో అధికారంలో ఉంది…ఈ విషయం అర్ధం చేసుకుని కేసీఆర్ డైరక్ట్‌గా బీజేపీపై వార్ మొదలుపెట్టారు.

amit-shah

అందుకే ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీని వల్ల కేంద్రం వర్సెస్ కేసీఆర్ అన్నట్లు వార్ మొదలైంది. ఇదే సమయంలో ఈ ధాన్యం అంశం వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు హైలైట్ అయ్యే పరిస్తితి లేకుండా పోయింది. బీజేపీ కూడా ఈ ధాన్యం అంశంపైనే టీఆర్ఎస్ పోరాడుతుంది తప్ప…ఇతర సమస్యలని పైకి తీసుకురాలేకపోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

అలాగే ధాన్యం కొనుగోలు అంశంపై మళ్ళీ కేసీఆర్‌ని మాట్లాడనివ్వకుండా ఉండేందుకు ఒక కీలక అస్త్రాన్ని బయటకు తీయనున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం బియ్యంలో అక్రమాలకు పాల్పడిందని, ఆ అక్రమాలకు సంబంధించిన వివరాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే వాటిని బయటపెడదామని బీజేపీ నేతలకు అమిత్ షా చెప్పినట్లు సమాచారం.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడా వెనక్కి తగ్గొద్దని, ప్రజలతో పాటు మీ దృష్టిని కూడా మళ్లించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తారని, ఆయన ట్రాప్‌లో పడవద్దని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించండని, ధాన్యం కొనుగోలులో కుంభకోణాన్ని ఎండగట్టండని నేతలకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేతల రాష్ట్రంలోని ఇతర సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే నిరుద్యోగుల సమస్యపై పోరాటం చేయనున్నారు. అమిత్ షా గైడెన్స్‌తో బీజేపీ నేతలు కొత్త రూట్‌లో వెళ్ళి కేసీఆర్‌కు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారు.