జగన్ అమరావతిలో అన్న మాటలు.. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు గుచ్చుకున్నాయి..!

489

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా తనతో టచ్‌లో ఉన్నారని.. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. టీడీపీ ఖాళీ కావాల్సిందేనని చెప్పారు. అయితే.. అది కరెక్ట్ కాదని.. ఆ సంప్రదాయం తప్పు అని.. చట్టసభలో ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పారు.

ఏపీలో మళ్లీ పాలన పుంజుకుంటోంది. కొత్త ప్రభుత్వం.. కొత్తగా కొత్తగా పాలన సాగిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తొలి శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నిన్న ఏపీ శాసనసభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా స్పీకర్ ధన్యవాద తీర్మాణంపై సభలో చర్చ జరిగింది.

ఈసందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా తనతో టచ్‌లో ఉన్నారని.. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. టీడీపీ ఖాళీ కావాల్సిందేనని చెప్పారు. అయితే.. అది కరెక్ట్ కాదని.. ఆ సంప్రదాయం తప్పు అని.. చట్టసభలో ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. పార్టీ మారిన వాళ్లు ఎవరైనా సరే.. వాళ్లపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్‌ను జగన్ కోరారు. ఒకవేళ తమ పార్టీలో చేరాలనుకునేవాళ్లు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరాలని జగన్ సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో తమ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌కు తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిని కూడా అనైతికంగా తమ పార్టీలో చేర్చుకోమని జగన్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను వైఎస్సార్సీపీ ఏనాటికీ ప్రోత్సహించదని జగన్ కుండ బద్ధలు కొట్టారు.

అయితే.. జగన్ అన్న మాటలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి చెంపపెట్టులా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతే కాదు.. సీఎల్పీని కూడా టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు. దీనిపై తెలంగాణలో పెద్ద రచ్చే జరిగింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే.. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా టీఆర్‌ఎస్ పార్టీ చేస్తోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మాటలు.. చంద్రబాబుకే కాదు.. సీఎం కేసీఆర్‌కు కూడా గుచ్చుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.