ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి కళ్ళెం వేసిన జగన్ సర్కార్

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర తరమవుతుండడంతో జనాలు ఆస్పత్రులకు ఎగబడుతున్నారు. ఇక కరోనా సంక్షోభాన్ని ఆసరాగా తీసుకున్న ఏపీలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలు ప్రజల నుంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. పరీక్షలపై అధికంగా వసూలు చేస్తూ ప్రజల నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నాయి. దీంతో ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరగా దీనిపై స్పందించింది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి కళ్ళెం వేసింది. ఈ మేరకు సీటీ స్కాన్‌ ధరను నిర్ణయిస్తూ జగన్ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్‌ఆర్‌ సీటీ స్కానింగ్‌కు గరిష్ఠ ధర రూ.3 వేలుగా నిర్ణయించింది. అలానే రూ.3వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయొద్దని… అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. స్కానింగ్ చేసే సమయంలో వాడే మాస్కు, పీపీఈ కిట్లు, స్ప్రెడ్ షీట్లతో కలిపి ఈ ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక పరీక్షల అనంతరం అనుమానితుల వివరాలను కొవిడ్ డాష్ బోర్డు వెబ్‌సైట్లో తప్పక నమోదు చేయాలని ఆదేశించింది.

ప్రైవేటు ఆస్పత్రులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడిలో కలెక్టర్లదే కీలకపాత్ర అని సీఎం జగన్ స్పష్టం చేశారు. జిల్లాలో శానిటైజేషన్, మాస్కులు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు 104కు ఫోన్ చేసే వారు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు