ఏపీ పోలీసుల‌పై న‌మ్మ‌కం లేని వ్య‌క్తి సీఎం అభ్య‌ర్థా?: సోమిరెడ్డి

ఏపీలోని ఏ వ్యవస్థ మీదా నమ్మకం లేని వైకాపా అధినేత జగన్‌.. హోదా ఇవ్వని మోదీపైనా, తెలంగాణ పోలీసుల పైనా నమ్మకం పెట్టుకున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేని జగన్ రాష్ట్రానికి సీఎం కావాలా? అంటూ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకెళ్తే ఉలుకు పలుకు లేని గవర్నర్ వద్దకెళ్లి విచారణ చేయమంటారా? అని నిలదీశారు. విజయవాడలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పులివెందులలో నేర చరిత్ర జగన్‌కు ఉందని.. కానీ నారావారి పల్లెలో చంద్రబాబుకు లేదన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌కు చీమ కుట్టకుండా చూసుకున్నామని తెలిపారు. సాక్షి పత్రికలో రాసే తప్పుడు రాతలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వైకాపా, భాజపా నేతలు భాష మార్చుకోవాలని సూచించారు. కేంద్రంతో విచారణ అని వైకాపా అంటోందని.. రాష్ట్రపతి పాలన అని భాజపా అంటోందని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక తరహాలోనే ఇక్కడా వైకాపాని అడ్డుపెట్టుకుని భాజపా కుట్ర పన్నుతోందని మంత్రి దుయ్యబట్టారు.

జగన్ మీద కేసులేస్తే సీబీఐని దొంగ అన్నారు, ఇప్పుడదే సీబీఐతో విచారణ చేయించమని అడుగుతారా? అని మండిపడ్డారు. జగన్ పక్కనుండేది చెత్త సలహాదారులని, జగన్‌పై సీబీఐ కేసులు వచ్చేలా చేసిన వాళ్లే ఇప్పుడూ సలహాలిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల పులి, సింహం అని చెప్పుకొనే జగన్ కోడి కత్తికే మంచమెక్కారని ఎద్దేవాచేశారు.