తిరుపతి చుట్టూ ఏపీ రాజకీయాలు.. కోర్టులోనే భవితవ్యం

-

తిరుపతి బైపోల్ ఎన్నికలను అన్ని పార్టీలూ సీరియస్ గా తీసుకున్నాయి. బీజేపీ సత్తా, జనసేన బలం, టీడీపీ పరువు, వైసీపీ ప్రతిష్ట అన్న మాదిరిగా ఎన్నికలు జరిగాయి. ఎలాగైనా గెలిచి ప్రజల్లో మళ్లీ స్థానం సంపాదించాలని బీజేపీ, జనసేన ఆరాటపడ్డాయి. అలాగే టీడీపీ కూడా గత అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈ సారి గెలిస్తే తమ పరువు దక్కుతుందని భావించింది. ఇక వరుస ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. ప్రతిపక్షాలు లేవని తేల్చి చెప్పాలనుకుంది.

ఈ క్రమంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. కరోనాను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారాలు నిర్వహించాయి. కాకపోతే ఇక్కడ కొన్ని ట్విస్టులు జరిగాయి. ప్రతిపక్షాల్లోని అధినేతలందరూ ప్రచారం చేసినా.. జగన్ మాత్రం చివరి నిముషంలో వెనక్కు తగ్గారు. కొవిడ్ కారణంగా సభ పెట్టట్లేదంటూ ప్రకటన చేశారు. దీంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అన్ని పార్టీలు మొత్తుకున్నాయి. అయితే చివరికి పోలింగ్ రోజు మాత్రం పెద్ద రగడే జరిగిందని చెప్పాలి. అధికార పార్టీ వాళ్లు బస్సుల్లో దొంగ ఓట్లు వేసేవారిని తీసుకొచ్చి ఓటేయించారంటూ ఆరోపించాయి ప్రతిపక్షాలు. మంత్రులు, ఎమ్మెల్యేలు కోడ్ ను ఉల్లంఘించి.. పోలింగ్ రోజు కూడా తిరుపతిలోనే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అలాగే అధికారులు, వార్డు వలంటీర్లు ఓటర్లను బెదిరించారని బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల ఫలితాలు ఆపేయాలని, రీ పోలింగ్ జరపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిక తోడు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా పోలింగ్ పై విచారణ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫలితాలను ప్రకటించకుండా.. ఎన్నికల సంఘంకు నోటీసులు ఇవ్వాలంటూ కోరింది. దీంతో ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తోంది కోర్టు. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలేవీ కోర్టు ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనికి ఇంకా టైమ్ ఉండటంతో మళ్లీ వాయిదా వేసే అవకాశాలే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version