హుజూరాబాద్‌లో ఏపీ రాజకీయాలు… టీఆర్ఎస్‌కు చుక్కలేనా?

సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది….అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నికలు జరిగినా….అధికార పార్టీకే అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావొచ్చు….ఏమైనా ఉపఎన్నికలు కావొచ్చు. ఎందుకంటే ప్రజలు అధికార పార్టీని దాటి వేరే పార్టీని గెలిపించరు. అధికార పార్టీని గెలిపిస్తేనే పనులు అవుతాయి కాబట్టి.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

పైగా పథకాలు సరిగ్గా అందవనే భయం కూడా ఉంటుంది. ఇటీవల ఏపీలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ అంతటి భారీ విజయాలని సాధించడానికి ఇది ఒక కారణమే. పైగా ప్రత్యర్ధి పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కొందరు అధికార పార్టీ నేతలు వైసీపీని గెలిపించకపోతే పథకాలు అందవని కొంచెం ప్రజలని భయపెట్టిన మాట వాస్తవమే అని కూడా ప్రచారం జరిగింది.

అయితే తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. టి‌ఆర్‌ఎస్‌ని గెలిపించకపోతే పథకాలు అందవని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. టీఆర్ఎస్‎కు ఓటేయకపోతే కల్యాణలక్ష్మి, ఫించన్, దళితబంధులాంటి పథకాలు ఇవ్వమని బెదిరిస్తున్నారని, కానీ తాను ఉన్నంత వరకు ఏ పథకాలని ఆగనివ్వను అని అన్నారు.

ఇప్పటికే హుజూరాబాద్‌లో గెలవడం కోసం టి‌ఆర్‌ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో…అన్నీ రకాల ప్రయత్నాలు చేసింది. ఇక చివరిగా ప్రజలని భయపెట్టి ఓట్లు వేయించుకునే స్థాయికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. కానీ అన్నీ ఉపఎన్నికలు మాదిరిగా హుజూరాబాద్ ఉపఎన్నిక కాదు. ఇక్కడ అధికార పార్టీకి అంత అనుకూల వాతావరణం లేదు. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేసినా అవి కేవలం ఈటల రాజీనామా వల్లే వచ్చాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో ఓటు వేయకపోతే పథకాలు రావని బెదిరితే ప్రజలు ఇంకా రివర్స్ అవుతారు. అసలే తెలంగాణ ప్రజలు ఇలాంటి వాటికి పెద్దగా భయపడరు. కాబట్టి టి‌ఆర్‌ఎస్ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసిన పెద్దగా ఉపయోగం లేదనే చెప్పొచ్చు.