తనదైన శైలిలో దూసుకుపోతున్న మంత్రి సీదిరి అప్పలరాజు వ్యూహం అదిరిపోతోందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అటు రాజకీయంగా ఇటు పాలన పరంగా, మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా ఆయన ఎంచుకున్న పంథా, అనుసరిస్తున్న మార్గానికి మంచి మార్కులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తొలిసారి విజయం సాధించిన అప్పలరాజు.. తనదైన భిన్న శైలితో వ్యవహరిస్తున్నారు. వివాదాలకు కడుదూరంగా.. పనిచేయడమే లక్ష్యంగా ఆయన చూపుతున్న చొరవ.. సీఎం జగన్ దగ్గర కూడా మంచి మార్కులు వేయించుకుంటోంది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. పైగా పలాస నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు గౌతు కుటుంబ సభ్యులు.
అనుమానాలను పటాపంచలు చేస్తూ..
గౌతు శ్యామ్ సుందర్ శివాజీ.. టీడీపీ తరఫున ఇక్కడ చక్రం తిప్పారు. ఇక, ఆయన కుమార్తె గౌతు శిరీష ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా, పలాస నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ సంపాయించుకుని పోటీ చేశారు. ప్రత్యేకంగా ఆమె గెలుపు కోసం.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ మూడు రోజుల పాటు పర్యటించి ప్రచారం చేశారు. దీంతో వైసీపీ తరఫున పోటీ చేసిన సీదిరి అప్పలరాజు గెలుపుపై అనుమానాలు రేకెత్తాయి. అప్పలరాజు ఎన్నికలకు యేడాదిన్నర ముందే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రజల్లో దూసుకుపోయారు. వృత్తిరీత్యా డాక్టర్ కావడం.. ప్రజల్లో మంచి పేరు ఉండడం.. జగన్ పాదయాత్ర.. వైసీపీ సునామీ.. ఇలా అన్నీ కలిసి వచ్చి.. ఆయన విజయం నల్లేరుపై నడకగా మారింది. దశాబ్దాలుగా పలాసలో తిష్టవేసిన గౌతు ఫ్యామిలీని కూకటివేళ్లతో పెకలించి వేశారు.
ఆదర్శ రాజకీయం!
సాధారణంగా.. టీడీపీలో గట్టి నేతలను ఓడించిన వైసీపీ నేతలు ఒకింత దూకుడుగా వ్యవహరిస్తారు. తామే ఈ ఘనత సాధించా మనే నాయకులు కనిపిస్తున్నారు కూడా. అయితే.. వినయ, విధేయతలను తన రాజకీయాలకు చెరోపక్క జోడించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు మాత్రం.. ఎప్పుడూ దూకుడుగా ముందుకు సాగలేదు. తన గెలుపును వైసీపీకి, పార్టీ అధినేత జగన్‌కు అంకితం చేసేశారు. అంతేకాదు.. ప్రజలకు చేరువయ్యేందుకు నిరంతరం ఆయన ప్రయత్నించారు. తన పరిదిలో వచ్చిన ప్రతి సమస్యను ఆయన పరిష్కరించారు. ఇదే సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు వేసేలా చేసింది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభకు పంపించిన సమయంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. సీఎం జగన్ .. ఆ పదవిని.. సీదిరికి ఇచ్చారు.
మొత్తంగా రాజకీయాల్లోకి వచ్చిన యేడాదిన్నరకే ఎమ్మెల్యే అయిన అప్పలరాజు మూడేళ్లకే మంత్రి అవ్వడంతో పాటు చిన్న వయస్సులోనే కీలక మైన కేబినెట్ బెర్త్ దక్కించుకుని రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేశారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చేయాలంటే కొప్పుల వెలమలు, కాళింగలు, తూర్పు కాపుల పేర్లు మాత్రమే వినిపించేవి. ఈ మూడు కులాల నేతలను పదవులు ఏనాడు దాటుకుని వెళ్లలేదు. అలాంటి వెనకపడ్డ మత్స్యకార సామాజిక వర్గం నుంచి మూడేళ్లలో ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదగడం మామలు విషయం కాదు.
అన్ని వర్గాల్లోనూ మంచి పేరు!
నిజానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. సీదిరి చాలా జూనియర్ అని తెరచాటు విమర్శలు కూడా చేశారు. అయితే.. పువ్వు పుట్టగానే పరిమిళించినట్టుగా.. సీదిరి.. తన నడవడిక, కలుపుగోలు తనంతో విమర్శలు చేసిన వారు సైతం నోరు వెళ్లబెట్టేలా అందరినీ కలుపుకొని పోయారు. ప్రతి ఒక్క సమస్యను తనదిగా పరిగణించి.. పరిష్కరించే ప్రయత్నించారు. ముఖ్యంగా అనేక వివాదాస్పద అంశాలపై కూడా చాకచక్యంగా వ్యవహరించి ఆచితూచి మాట్లాడారు. దీంతో బెస్ట్ మినిస్టర్‌గా ఆయన అనతికాలంలోనే గుర్తింపు సాధించారు.
మరీ ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గం సమస్యలను పరిష్కరించడంలోను, జిల్లా అభివృద్ధి విషయంలోనూ ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో వైసీపీలో సీదిరికి ఇక తిరుగులేదనే టాక్ సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. యువ నాయకుడు, విద్యావంతుడు, వినయసంపన్నుడు కావడం.. వంటివి సీదిరికి మరింతగా కలిసి వస్తున్న అంశాలు. ఇక, దశాబ్దాల చరిత్ర ఉన్న గౌతు ఫ్యామిలీకి అడ్రస్ లేకుండా చేయడం.. రాజకీయంగా ఆయనను మరింత సమున్నత స్థానంలో కూర్చోబెట్టిందనడంలో సందేహం లేదు.