రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అవసరానికి మించే మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుపోయారు. ఇదే మాట విమర్శకుల నుంచి కూడా వినిపించింది. ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి మనుషులతో కోరి కయ్యం తెచ్చుకున్నారు కూడా ! వైఎస్సార్ హయాం నుంచి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కేవలం కొన్ని వ్యాపార లావాదేవీల కారణంగానే చెడగొట్టుకు న్నారు అని కూడా గతంలో అనేక కథనాలు వచ్చాయి.
ఆఖరికి ఆయన టీడీపీ చెప్పిన విధంగా మాట్లాడుతున్నారు అన్న వాదన కూడా సాయిరెడ్డి వినిపించారు. ఇప్పుడు తప్పు ఎవరిది అయినా ఆయన ఢిల్లీ అయితే దాటి రావడం లేదు. వచ్చినా కూడా ఆయన్ను అరెస్టు చేయడం ఖాయం. అందుకే ఆయన తగినంత భద్రత ఇస్తే వస్తా అంటూ ప్రధానిని వేడుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆయన్ను అరెస్టు చేయాలనే చూస్తోందని, గతంలో ఆయనపై నమోదయిన కేసులను, ఆర్థిక నేరాలను తవ్వితీయాలని కూడా భావిస్తోందని సమాచారం.
జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం రానున్నారు. ఇక్కడ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా ప్రధాని రావడంతో ఇక్కడికి ఎంపీ (నరసరావుపేట) రఘు రామ కృష్ణం రాజు కూడా రావాలనుకుంటున్నారు. కానీ తాను వచ్చేందుకు ఇక్కడి స్థితిగతులు అనుకూలంగా లేవని ఢిల్లీ కేంద్రంగా ఓ ప్రచారాన్ని చేసుకుంటున్నారు రఘురామ.
దీనిపైనే వైసీపీ కూడా జోకులు వేస్తోంది. ఓ ఎంపీ స్థాయి వ్యక్తి మమ్మల్ని నోటికి వచ్చిన విధంగా తిట్టి ఇప్పుడు అరెస్టులకు ఎలా భయపడతారని అంటోంది.ఆ విధంగా రఘురామకు ఉన్న ఫియర్స్ పై సెటైర్లు పడుతున్నాయి. అయితే మోడీ వచ్చినప్పుడే తానూ ఇక్కడికి వస్తే బాగుంటుంది అని, ప్రొటొకాల్ ప్రకారం కూడా తాను అక్కడ ఉండాల్సి ఉందని రఘురామ భావిస్తున్నారు. మరి! ఆయన ఆలోచనకు అనుగుణంగా బీజేపీ ఏం చేస్తుందో ? లేదా వైసీపీ ఏ విధంగా ఉండనుందో ? అన్నవి చర్చకు వస్తున్నాయి.