గురుశిష్యుల్లో గెలుపెవరిదీ…?

-

ఏపీ రాజకీయాల్లో వారిద్దరిదీ గురుశిష్యుల బంధం. ఇంకా చెప్పాలంటే విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తిని బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకువచ్చారనే మాట కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు వారిద్దరే ముఖాముఖి తలపడుతున్నారు. ఎవరా ఇద్దరనుకుంటున్నారా… వారే గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్. ఉత్తరాంధ్రకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య 2009 నుంచి రాజకీయ అనుబంధం కొనసాగుతోంది. 2019 ఎన్నికల వరకు పదేళ్ల పాటు ఇద్దరు కలిసే ప్రయాణం చేశారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరి దారులు వేరయ్యాయి.

నాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. 2009లో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన గెలిచారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇక 2014 ఎన్నికల నాటికి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి అసెంబ్లీకి ఎన్నికవ్వగా… అవంతి శ్రీనివాస్ మాత్రం అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు అవంతి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గంటా విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ తరఫున గెలవగా… అవంతి భీమిలి నుంచి వైసీపీ తరఫున గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత గంటా శ్రీనివాస్ పార్టీ మారుతారంటూ పుకార్లు షికారు చేశాయి. చివరికి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గంటా మార్పుపై ప్రకటనలు చేశారు. అదే సమయంలో గంటా వైసీపీలోకి రాకుండా అవంతి అడ్డుకున్నాడనే మాట కూడా బలంగానే వినిపించింది. ఇలా గురుశిష్యుల మధ్య వైరం మొదలైంది. గంటాపై అవంతి విమర్శలు కూడా చేశారు. అయితే సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు.

భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస్ టీడీపీ తరఫున, అవంతి శ్రీనివాస్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గంటాకు భీమిలి నియోజకవర్గంలో బలమైన సంబంధాలున్నాయి. అవంతి సిట్టింగ్ ఎమ్మెల్యే. దీంతో ఈ ఎన్నికల ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు…. ఇప్పటి వరకు ఓటమి అంటే తెలియని వారే. అటు గంటా, ఇటు అవంతి… ఇప్పటి వరకు ఓడిపోలేదు. కాబట్టి ఎవరు గెలుస్తారు… ఎవరు తొలిసారి ఓడిపోతారనే ప్రశ్న ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news