టీడీపీలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిబద్దతతో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు. ఓడినా, గెలిచినా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు చాలామంది టీడీపీ నేతలు బయటకు రాని పరిస్తితి. అయినా సరే అయ్యన్న వైసీపీపై గట్టిగానే పోరాడారు ఎన్ని కేసులు పెట్టిన అలాగే నిలబడ్డారు.
కానీ అదే విశాఖ జిల్లాలో ఉన్న గంటా శ్రీనివాసరావు రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అనేక పార్టీలు మారుతూ వచ్చారు. 2014 ఎన్నికల ముందు మళ్ళీ టీడీపీలో చేరారు. మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టీడీపీ అధికారంలో లేకపోవడంతో పార్టీలో అడ్రెస్ లేరు..చాలాసార్లు ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం వచ్చింది. ఇక టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవుతుందనే తరుణంలో గంటా మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు..లోకేష్‌ని కలిశారు.
ఇలా ఇన్నాళ్ళు పార్టీ కష్టాల్లో ఉన్నా సరే బయటకురాని గంటా ఇప్పుడు బయటకు రావడంపై అయ్యన్న ఫైర్ అవుతున్నారు. ‘ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? పార్టీలో అందరూ రావాలి…పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక’ అని అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని విరుచుకుపడ్డారు.
అయితే విశాఖలో మొదట నుంచి అయ్యన్న, గంటాలకు పెద్దగా పడదు అనే చెప్పాలి. పైగా గంటా ఇంతకాలం పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు..కానీ ఇప్పుడు మళ్ళీ పార్టీలో హల్చల్ చేస్తున్నారు. దాంతోనే అయ్యన్న ఫైర్ అయ్యారని తెలుస్తోంది.