ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం… ఇదీ ఆయన రాజకీయ ప్రస్థానం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడి నామినేషన్‌ను శుక్రవారం ఆయన తరఫున కూటమి నేతలు అయిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌,మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్‌ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులుకు అందజేశారు. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు ఒకే నామినేషన్‌ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది.
మొన్నటి ఎన్నికల్లో ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.

నూతన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెదేపా ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అయ్యన్న ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీచేసి ఏడుసార్లు గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు, అటవీ,పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు 1983, 85, 94, 99, 2004, 2014,2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోవైపు 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. అటు నందమూరి తారక రామారావు, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం ఉంది.

స్పీకర్ పదవి దక్కడంపై అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తపరిచారు.ఇప్పటివరకు అన్ని రకాల పదవులు చేశానని స్పీకర్ గా ఛాన్స్ దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తుకు రాకూడదని.. గౌరవ విపక్ష సభ్యులకు కూడా అసెంబ్లీలో ప్రాధాన్యం ఇస్తానని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మొత్తానికి అయితే స్పీకర్ పదవితో అయ్యన్నపాత్రుడు యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news