కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటును ప్రయివేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. థర్మల్ ప్లాంటు నిర్వహణకు సంబంధించి నిర్వహణ వ్యయం మోసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో ప్లాంటును అదానీ లాంటి పెద్ద సంస్థలకు అప్పగించేందుకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతుండగా మరోవైపు ఉద్యోగ సంఘాల జేఏసీతో నిన్నటి వేళ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇక్కడి థర్మల్ విద్యుత్ ప్లాంటును ప్రభుత్వ పరంగా ఏ విధంగా నడపాలో అన్నవిషయమై సీఎస్ ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేయొచ్చని,ఇందుకు సంబంధించిన నివేదిక పంపాలని నిర్దేశించారు. ప్లాంటు ప్రయివేటీకరణ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఎప్పటి నుంచో ఇక్కడ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో కొంతలో కొంత ఊరటనిస్తూ నిన్నటివేళ చర్చలు సాగాయి.ఇకపై ప్రతి 15 రోజులకొకసారి ప్లాంటు సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమేనని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. చర్చలు మొన్నటి వేళ (బుధవారం) అర్ధరాత్రి వరకూ సాగాయి.
మరోవైపు ప్లాంటు నిర్వహణ భారం తాము మోయలేమని ఎప్పటి నుంచో ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. దేశీయంగా బొగ్గు కొనుగోళ్లు భారంగా మారడం,విదేశాల నుంచి కూడా తెప్పించుకునేందుకు ఉన్న దారులు కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో ప్లాంటు భవితవ్య ప్రశ్నార్థకంగానే ఉంది. దీంతో పాటు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ప్లాంటు ఎప్పటికప్పుడు మూత పడుతూ వస్తోంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అన్నీ ఇదేవిధంగా ఏటికి ఎదురీదుతూ ఉన్నాయి. మరోవైపు సింగరేణి పరిధిలో నాలుగు బ్లాక్ లను ప్రయివేటు వర్గాలకు అప్పగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. ఈ ఓపెన్ బిడ్డింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొని బొగ్గు గనులను దక్కించుకోవచ్చు. మరోవైపు ఒడిశా,ఛత్తీస్ గఢ్ లలో కూడా బొగ్గు గనులు దక్కించుకునేందుకు అవకాశాలు ఉన్నా అవన్నీ వదిలేసి కేవలం దిగుమతులపై దృష్టి పెట్టి ప్లాంటు కు ఉనికి అన్నదే లేకుండా చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.