తెలంగాణలో ఆసక్తి రేపిన దుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. ఈ నెల 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై పడింది. గతంలో గ్రేటర్లో కారు పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఈ సారి పరిస్థితులు అంత సానుకూలంగా అయితే లేవు. కమలం గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. పైగా సికింద్రాబాద్ ఎంపీ సీటు కూడా కమలం ఖాతాల ఉండగా.. అక్కడ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రాథినిత్యం వహిస్తుండడంతో గ్రేటర్ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిందో లేదో వెంటనే కమలం పార్టీ గ్రేటర్ ఎన్నికల ఆపరేషన్ స్టార్ట్ చేసేసింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో కారు పార్టీకి షాక్ ఇవ్వాలన్న ప్లానింగ్‌తో కారు పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేసేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాజీ మేయర్, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై బీజేపీ గురి పెట్టిందంటున్నారు. బీజేపీలో చేరాలని తీగలకృష్ణారెడ్డిని బీజేపీ పెద్దలు ఆహ్వానించారని సమాచారం.
2014 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తీగల.. ఆ తర్వాత కారు ఎక్కేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సబిత సైతం కారెక్కి మంత్రి అవ్వడంతో తీగల నియోజకవర్గంలో పూర్తిగా డమ్మీ అయిపోయారు. కనీసం సబితతో పాటు ఆమె కుమారుడు నియోజకవర్గంలో హవా చెలాయిస్తుండడంతో తీగలకు ఓ కార్పొరేటర్ స్థాయి ప్రధాన్యం కూడా లేదు.
ఈ క్రమంలోనే తీగలపై దృష్టి పెట్టిన కాషాయ దళం పార్టీలోకి వస్తే మహేశ్వరంలో గ్రేటర్ ఎన్నికల బాధ్యతలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తానని ఆఫర్ చేసిందట. మరి తీగల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నదానిపైనే ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. తీగల కారు పార్టీ నుంచి బయటకు వస్తే మరి కొంత మంది నేతలు సైతం కారు దిగుతారని అంటున్నారు.