ఇటీవల ఏపీ బిజేపి పూర్తిగా జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు జగన్‌ని కాకుండా చంద్రబాబుపై విరుచుకుపడిన వారు ఇప్పుడు రివర్స్ అయ్యి..జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఏపీ బిజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. అయితే టిడిపితో పొత్తుకు బిజేపి సిద్ధమైందనే నేపథ్యంలోనే ఈ మార్పు జరిగిందని తెలుస్తుంది. ఇప్పటికే పవన్, చంద్రబాబు కలిశారు..ఇప్పుడు వీరు బిజేపిని కూడా కలుపుకుంటున్నారు.
అందులో భాగంగానే వైసీపీకి అనుకూలంగా ఉండే సోము వీర్రాజుని తప్పించి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా పెట్టారని తెలుస్తుంది. అలాగే జగన్ పట్ల సానుకూలంగా ఉండే కొందరు బిజేపి నేతల స్వరం మారుతుంది. ఈ క్రమంలో బిజేపి నేత విష్ణు వర్ధన్ రెడ్డి..అనూహ్యంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీ అప్పులపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిందని అంటున్నారు.
అలాగే వైసీపీకి దమ్ముంటే సమాధానాలు చెప్పాలని కొన్ని ప్రశ్నలు సంధించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కన్నా ఏపీ ఎందుకు వెనకబడి ఉంది? అని, బాలల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానం, మహిళల అక్రమ రవాణాలో ముందు వరసలో ఉందనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పేదలను మరింత పేదలుగా మార్చేలా జగన్ పనితీరు ఉందని.. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం.. ఆ పేదల పేరు చెప్పి నాయకులు దోచుకుంది వాస్తవం కాదా అని నిలదీశారు
అలాగే ప్రజలతో చీ కొట్టించుకున్న ఒక దర్శకుడిని తెచ్చి అర్ధ నగ్న భంగిమలు ఎలా ఉన్నాయో విద్యార్థులతో చెప్పించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అని చెప్పి..కల్తీ మద్యంతో పేద మహిళ పుస్తెలను తెంచి, వారి జీవితాలను వీధిలోకి తెచ్చారని, అసలు వైసీపీ బూతులకు సరైన సమాధానం ఇవ్వాలంటే తమ బూత్ స్థాయి నాయకులు చాలు అని విష్ణు సవాల్ చేశారు. మొత్తానికి టిడిపితో పొత్తు కోసం బిజేపి..పూర్తిగా వైసీపీని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.