మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి.. కాంగ్రెస్‌తో జట్టుకట్టనున్నారా..? బీజేపీలో చేరతారా?? లేక కొత్త పార్టీ పెడతారా..?? అంటూ చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చెయ్యడం, ఆయన భూకబ్జా చేశాడంటూ కేసులు నమోదు చెయ్యడం చకచకా జరిగిపోయాయి. ఈటెల భూములపై జరిపిన విచారణ చెల్లదని, అంతతొందరెందుకంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అప్పటి వరకు కేవలం ఈటెలపై రాజకీయంగా అణచివేసేందుకు చేస్తున్న కుట్రగా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈటెల బార్యకు చెందిన హార్చరీస్, ఈటెల కుమారుడు నితిన్ రెడ్డిపై కేసులు పెట్టడం కేసీఆర్‌కు ఈటెలపై కోపం మాత్రమే కాదు కక్ష అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అది కక్షనో లేక కోపమో మరేదో.. ఏదైనా కూడా ఈటెల రాజేందర్ భవితవ్యం ఏలా ఉండబోతోందో అనేది ఆసక్తికర అంశం…
ఈటెలను మంత్రి వర్గం నుండి తొలగించిన తరువాత ఆయన వెంట కుల సంఘాలు, కొందరు టీఆర్ఎస్ నాయకులు ఉన్నా కూడా.. టీఆర్ఎస్ అధికారంలో ఉంది గనక ఈటెలను అందరి నుండి దూరం చెయ్యడంలో సఫలమైంది అధికార పార్టీ. ఈటెలపై మరిన్ని కేసులు పెట్టి రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈటెల రాజేందర్ గనక రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తన శక్తులన్నింటినీ ఉపయోగిస్తుంది. సో ఈటెల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం సరికాదు..
సొంత పార్టీ పెట్టడం అనేది అసలు కన్సిడర్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు పెట్టినా ఒక్కటి కూడా మనుగడలో లేకుండా పోయాయి. అదీగాక సొంతంగా పార్టీ పెట్టడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. గతంలో దేవేందర్ గౌడ్, చిరంజీవి లాంటివారెందరో పార్టీ పెట్టినా నడిపించలేక విలీనాలు చేసేశారు.
మరి రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. అంపశయ్యపై ఉందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఈటెల ఆ పార్టీలో చేరినా.. విభేందించేవారు కూడా ఉండనే ఉంటారు. కేవలం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే కాంగ్రెస్‌వైపు కొందరైనా చూస్తున్నారడం సమంజసమే..
ఈటెల రాజేందర్‌కి సరియైన ఆప్షన్ బీజేపీనే.. ఎందుకంటే.. కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీలో చేరితే ఫస్ట్ ఆయనకు వ్యక్తిగత, ఆస్తులకు రక్షణ వస్తుంది. కేంద్రాన్ని ఎదిరించి ఈటెలపై ప్రతీకార చర్యలకు దిగడానికి వెనుకంజ వేస్తుంది. ఒక వేళ అన్నీ తెలిసిన ఈటెల బీజేపీ తరుఫున టీఆర్ఎస్ అక్రమాలు అని గనక కేసులు పెడితే ఎంతమంది మెడకు అది చుట్టుకుంటుందో అందరికీ తెలుసు…
తెలంగాణలో టీఆర్ఎస్‌కు అల్టర్‌నేట్ మాత్రం ఖచ్చితంగా బీజేపీనే.. మొన్నటి గ్రేటర్ ఫలితాలు అందుకు ఉదాహరణ. మరో అంశం దుబ్బాకలో రఘునందన్ రావుకు ఉన్న వ్యక్తిగత ప్రతిష్ట, సానుభూతితో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ టీఆర్ఎస్‌ను ఓడించింది. అలాగే ఈటెల అంశంలో కూడా రాజేందర్‌కు ఉన్న వ్యక్తిగత ప్రతిష్ట, సుధీర్ఘ రాజకీయ అనుభవం, కులం అశం, సానుభూతి వంటి అంశాలతో పాటు బీజేపీ లాంటి బలమైన పార్టీతో జతకడితే ఈటెల గెలుపు ఖాయం.
ఏవిధంగా చూసినా ఈటెలకు వ్యక్తిగతంగా, రాజకీయంగా బీజేపీ పార్టీతో మేలు జరుగుతుందనేది విశ్లేషకుల మాట. ఈటెల ఎంట్రీ కూడా బీజేపీకి కలిసి వస్తుంది. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణ కోసం కష్టపడి వెలివేయబడిన వారితో జట్టు కట్టడం ఈటెల ద్వారా సులభం అవుతుంది.