తెలంగాణలో బీజేపీ లక్ష్యంగా కొత్తగా తెలంగాణలో బీజేపీ బలోపేతం బాధ్యతని తీసుకున్న సునీల్ బన్సాల్ పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా తరుణ్ ఛుగ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయనకు పార్టీ బాధ్యతలు అప్పగించి..క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే బాధ్యతని సునీల్‌కు అప్పగించారు. మొన్నటివరకు యూపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించిన సునీల్..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేతలు దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూనే..మరోవైపు కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. అలాగే రాష్ట్రంలోని సమస్యలపై బండితో కలిసి ఇతర నేతలు గళం విప్పుతున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి నేతలని తీసుకొచ్చే బాధ్యత ఈటల రాజేందర్ టీం చూసుకుంటుంది. అలాగే ముందుగోడు ఉపఎన్నిక బాధ్యతని మాజీ ఎంపీ వివేక్ చూసుకుంటున్నారు.
ఇలా ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఇదే క్రమంలో బీజేపీకి చెందిన కొన్ని సర్వే సంస్థలు తెలంగాణలో దిగి పనిచేయడం మొదలుపెట్టాయి. క్షేత్రస్థాయిలో పాతుకుపోయేందుకు అంతర్గతంగా సర్వేలు చేయిస్తోంది. గత ఆరు నెలల్లో మూడు దఫాలుగా ఈ ప్రక్రియ కొనసాగిందని, మొత్తం 90 బృందాలు క్షేత్రస్థాయిలో పని చేసి సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన వివరాలను అమిత్‌షాకు నివేదించాయని తెలిసింది. ఈ మేరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయగల 500 మంది ప్రముఖుల వివరాల జాబితా పార్టీ జాతీయ నాయకత్వానికి చేరిందని తెలిసింది.
ఇదిలా ఉంటే సునీల్ సైతం తన ఆపరేషన్ మొదలుపెట్టేశారు. యూపీలో పని చేసిన సర్వే బృందాలను ఇప్పటికే బన్సల్ తెలంగాణలో మోహరించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితితోపాటు పార్టీ ఓటుబ్యాంకు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందాలు సిఫారసు చేయనున్నాయి. మొత్తానికి తెలంగాణని కమలం చుట్టేస్తుంది.