రేసులో రివర్స్..కమలంలో ఏం జరుగుతోంది?

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పటివరకు ఏకపక్షంగానే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం దగ్గర నుంచి బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అని బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మొన్నటివరకు బిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా బిజెపి తన పావులు కదుపుతూ వచ్చింది.

బిజెపి గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను సాధించగలిగింది, అప్పుడు 20% ఓట్లను కూడా పొందింది. ఇది చూసి అప్పటివరకు  తెలంగాణలో బిజెపి లేదు అనుకున్న వారందరూ అవాక్కయ్యారు. ఆ క్షణం నుంచి టిడిపి నుంచి బిఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వలసలు ఎక్కువయ్యాయి. అదే విధంగా ఉపఎన్నికల్లో గెలుపు, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడంతో ఇంకా బి‌జే‌పి..బి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే పరిస్తితి. కానీ వలసనేతలు పెరిగిన దగ్గర్నుంచి వివాదాలు, గ్రూపు రాజకీయాలు తప్ప తెలంగాణ బిజెపిలో మరోటి లేకుండా పోయింది. పార్టీ లీడర్ గా బండి సంజయ్ ఉన్నంతకాలం ఓ వర్గం వారు అతనిపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వాటిని తట్టుకోలేక అధిష్టానం పార్టీ లీడర్ గా కిషన్ రెడ్డిని నియమించిన వారి పద్ధతి మాత్రం మార్చుకోలేదు. వారికి ఏమి కావాలో ఏమి కోరుకుంటున్నారో కూడా తెలియక ఢిల్లీ పెద్దలు తలలు కొట్టుకుంటున్నారు .

పార్టీలో తమకు గుర్తింపు లేదని, పార్టీ లీడర్ తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదులు చేసుకోవడంతోటే సరిపోతుంది. వీరిని సమన్వయ పరచడానికి బిజెపి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం సాధించాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న బిజెపికి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బి‌జే‌పి రేసులో వెనుకబడింది.

Read more RELATED
Recommended to you

Latest news