తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వచ్చే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైలెంట్ గా పార్టీని ప్రక్షాళన చేసి..మళ్ళీ కొత్త కమిటీలతో ముందుకొస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలపడేలా కాసాని పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో సోలో గా అయిన పోటీకి రెడీ అవుతున్నారు.
ఎలాగైనా తెలంగాణలో ఈ సారి సత్తా చాటాలని చూస్తున్నారు. గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో టిడిపి రాణించడం అనేది చాలా కష్టమైన పని. కానీ కొన్ని స్థానాల్లో అయినా రాణించే విధంగా కాసాని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పార్టీ బలంపై సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం టిడిపికి దాదాపు 7-8 శాతం ఓటింగ్ ఉందని తేలిందట. దాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కాసాని చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో పార్టీకి ఒక సీటు కూడా గెలిచే బలం లేదనే చెప్పాలి.
కానీ ఎన్నికల నాటికి బలం పెంచుకుని కనీసం 5-6 సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొన్ని కీలకమైన స్థానాలపై టిడిపి ఫోకస్ చేసిందని తెలిసింది. అందులో ప్రధానంగా 9 సీట్లపై టిడిపి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి ఈ 9 సీట్లపై టిడిపి ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తుంది.
ఎందుకంటే ఈ సీట్లలో ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువ. అందుకే ఆ సీట్లని ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం ఈ సీట్లు అన్నీ బిఆర్‌ఎస్ చేతుల్లోనే ఉన్నాయి. టిడిపి బరిలో ఉంటే ఈ సీట్లలో బిఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని చెప్పవచ్చు.