7 రోజులు.. 8 మంది ఎమ్మెల్యేలు.. గులాబీలను ఆకర్షిస్తున్న హస్తం

-

తెలంగాణ రాజకీయాల్లో వచ్చే వారం రోజుల్లో కీలక పరిణామాలు జరగనున్నాయా? పది రోజుల కిందట వచ్చిన ఊహాగానాలు నిజం అవుతున్నాయా..? గుంపుగుంపుగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పనున్నారా? పరిణామాలను బట్టి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. ఉరుము లేని పిడుగులా అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్ గా కీలక బాధ్యతల్లో పనిచేసిన పోచారం.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితులు. అయితే, పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు.

పది రోజుల కిందట బీఆర్ఎస్ కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అందులో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీకి చెందిన వారు కాంగ్రెస్ లో చేరతారనే కథనాలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడకు చెందిన పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా, మరో 7-8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ బాటలో ఉన్నారనే ఫీలర్లు వస్తున్నాయి. వీరిలో ఎవరెవరు ఎక్కడివారు అనేది తెలియకున్నా.. కచ్చితంగా వచ్చే వారంలో కీలక పరిణామాలు జరగడం ఖాయమని తెలుస్తోంది.

బండారి దారి అటే.. ఓవైపు పోచారం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే.. గ్రేటర్ హైదరాబాద్ లోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. దీంతో లక్ష్మారెడ్డి కూడా హస్తం గూటిలో చేరుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ కండువా కప్పుకొనే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల్లో ఆయననే ముందుంజలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి దీనిపై లక్ష్మారెడ్డి స్పందన వేరేగా ఉంది. గురువారం జానారెడ్డి జన్మదినం కావడంతో.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. గురువారం జన్మదినం అయితే మరుసటి రోజు శుభాకాంక్షలు చెప్పడం ఏమిటో కానీ, లక్ష్మారెడ్డి మాత్రం తాను పార్టీ మారడం లేదని చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ లో చేరకముందు మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం ఇదే విధంగా స్పందించిన సంగతి గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news