కర్నూలు మాజీ ఎంపీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకురాలు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక.. ఒక్కసారిగా పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు వచ్చారు. ఆమె త్వరలోనే పార్టీ మారబోతున్నారని.. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడి నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని.. లోకల్‌గా ఉన్న ఓ ఎంపీ .. ఆమెను బీజేపీలోకి చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. ఏం కావాలంటే.. అది చేస్తామని కూడా బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని ఓ వర్గం అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అదేసయమంలో సోషల్ మీడియాలోనూ రేణుకపై కామెంట్లు కూడా వచ్చాయి.
ఈ పరిణామం వైసీపీలో ఎలా ఉన్నా.. కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వార్తలు వచ్చిన తర్వాత.. బీజేపీ నేతలు ఒక్కరు కూడా ఔనని కానీ, కాదని కానీ కామెంట్లు చేయకపోవడం గమనార్హం. అయితే.. రేణుక మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. వైసీపీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. అయితే.. ఇంత మాత్రానికే రెండు రోజుల పాటు ఇలాంటి వార్తలు వస్తున్నా.. ఆమె మౌనంగా ఉన్నారు? అనేది కీలక ప్రశ్న. 2014లో వైసీపీ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసిన రేణుక.. విజయం సాధించారు. ఆ తర్వాత 2017లో చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయారు.
ఈ క్రమంలోనే వైసీపీకి దూరమయ్యారు. అయితే.. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు టికెట్ ఇస్తారని అనుకున్నా.. అనూహ్యంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. టీడీపీలోకి రావడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో బుట్టా రేణుక మళ్లీ.. వైసీపీ చెంతకు చేరిపోయారు. కానీ, అప్పటికే టికెట్ వేరే వారికి కన్ఫర్మ్ చేయడంతో ఇక్కడ ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే.. అప్పటి నుంచి తనకు ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా? అని ఆమె ఆశగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కానీ.. జగన్ కానీ, పార్టీ సీనియర్లు కానీ.. ఎవరూ కూడా బుట్టాను పట్టించుకోవడంలేదు.
ఒక్క రేణుక అనేకాదు.. చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు. వారిని ఎవరినీ కూడా జగన్ పట్టించుకోవడం లేదు. కారణాలు అనేకం ఉండొచ్చు. అందరూ కూడా వేచి చూస్తున్నారు. అయితే.. మరో రెండేళ్ల తర్వాత.. ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభం అయితే.. అప్పుడు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదనుకున్నారో.. లేక.. త్వరలోనే మరో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయనే సమాచారం అందుకున్నారో. తెలియదు కానీ.. ఒక్కసారిగా బాంబు పేల్చారని అంటున్నారు పరిశీలకులు. ఇది ఉద్దేశపూర్వంగా చేసిందనేనని.. జగన్‌ను తట్టి లేపేందుకు రేణుక చేసిన ప్రయత్నమని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.