ఈ రోజు వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఇప్పటికే ఆ పార్టీ 175 స్థానాలకు గాను 124 స్థానాల్లో గెలుపొంది, మరో 26 స్థానాల్లో ఇంకా ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో తమ పార్టీ ఓటమిని అంగీకరించిన సీఎం చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు చంద్రబాబు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. దీంతో గవర్నర్ చంద్రబాబు రాజీనామాను ఆమోదించారు.
కాగా రాజీనామా అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. ఇక ఏపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ చంద్రబాబును కోరారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు.