హామీలకు ఆకర్షితులై…

-

ఎన్నికల్లో టీడీపీ కూటమి గట్టెక్కటానికి చంద్రబాబు గుప్పించిన హామీలే ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్‌ అమలు చేసిన పథకాల కంటే ఎక్కువగా అందిస్తామని నమ్మబలకడంతో ప్రజలు ఆకర్షితులైనట్లు అంచనాలు ఉన్నాయి. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎడాపెడా హామీలను ఇచ్చేసిన చంద్రబాబు.. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15 వేలు చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులిస్తామని ప్రకటించడంతో ఇప్పటికే అమ్మఒడి ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు ఆకర్షణకు గురైనట్లు చెబుతున్నారు.

ఐదేళ్లుగా ప్రతి నెలా ఇంటి వద్దే టంచన్‌గా ఫించన్లను అందిస్తుండగా తాము రూ.4 వేలకు పెంచి ఇస్తామన్న చంద్రబాబు వాగ్దానంపై వృద్ధులు ఆశపడ్డారు. ఏప్రిల్‌ నుంచే దీన్ని అమలు చేయడంతోపాటు జూలైలో బకాయిలతో కలిపి మొత్తం ఆ నెలలో రూ.7 వేల పింఛను అందిస్తామని చంద్రబాబు చెప్పారు. కొన్ని వర్గాలకు పింఛన్‌ వయో పరిమితి తగ్గింపుతోపాటు ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆరి్థక సాయం అందిస్తామనడంతో అన్నదాతలు ఆశలు పెంచుకున్నట్లు వెల్లడవుతోంది.

అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసి తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానని చంద్రబాబు ప్రకటించడంతో నిరుద్యోగులు ఆకర్షితులయ్యారు. ఏటా జాబ్‌ క్యాలెండర్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని బాబు హామీలిచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున సాయం, ప్రతి ఇంటికి ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి వాగ్దానాలతో అక్క చెల్లెమ్మలు టీడీపీ వైపు మొగ్గినట్లు భావిస్తున్నారు.

స్వయం సహాయక సంఘాలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని చంద్రబాబు హామీలివ్వడం కూడా మరో కారణం. ప్రతి ఇంటికీ మేలు చేస్తూ సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించడంతోపాటు వారికి రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ద్వారా చంద్రబాబు మరో ఎత్తుగడ వేశారు. గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానని ఇచి్చన హామీలు కూడా ప్రభావితం చేశాయి. పోలవరాన్ని సత్వరం పూర్తి చేస్తానని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తానంటూ చంద్రబాబు హామీలిచ్చారు.

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందులను పంపిణీ చేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తుండగా తాను నేరుగా కాలేజీలకే చెల్లిస్తానంటూ చంద్రబాబు చెప్పారు. గతంలో మాదిరిగా ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని ప్రకటించారు. మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్‌ ఫ్రం హోం స్టేషన్లు ఏర్పాటు చేస్తానని ఇచి్చన హామీలు కొంతమేర ప్రభావం చూపడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news