కేశినేనికి పొగ..బాబు సెట్ చేయరా?

-

టీడీపీలో ఎంపీ కేశినేని నానిని పొమ్మనలేక పొగపెడుతున్నారా.? నెక్స్ట్ ఎన్నికల్లో కేశినేని తమ్ముడుకు సీటు ఇవ్వడానికి…కేశినేనికి ముందే చెక్ పెడుతున్నారా? అసలు టీడీపీ నేతలు…కేశినేనితో ఎందుకు సఖ్యతగా ఉండటం లేదు? ఇన్ని వివాదాలు ఉన్నా సరే చంద్రబాబు ఎందుకు సర్దిచెప్పడం లేదు? అసలు విజయవాడ టీడీపీలో ఏం జరుగుతుంది? అనేది సొంత పార్టీ కార్యకర్తలకే డౌట్ వస్తుంది.

జగన్ గాలిని సైతం ఎదురుకుని 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని గెలిచారు…అయితే గెలిచాక కేశినేని..సొంత పార్టీలో ఉన్న తప్పిదాలని ఎత్తిచూపుతూ వచ్చారు. ఇదే క్రమంలో విజయవాడలోని కీలక నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమాలతో  విభేదాలు మొదలయ్యాయి. అలాగే పరోక్షంగా దేవినేని ఉమాతో కూడా కేశినేనికి పడటం లేదు. ఇక విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తన కుమార్తెని మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇదే క్రమంలో బోండా, బుద్దాలపై విమర్శలు కూడా చేశారు. వారు కూడా కేశినేనిపై ఫైర్ అయ్యారు.

ఇలా రచ్చ జరగడం వల్ల గెలవాల్సిన కార్పొరేషన్ లో టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత కూడా వీరి మధ్య రచ్చ జరుగుతుంది…పైగా కేశినేనికి…విజయవాడ వెస్ట్ బాధ్యతలు అప్పగించారు…కానీ అక్కడ బుద్దా వర్గం కేశినేనికి సహకరించడం లేదు. ఇదే సమయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని సోదరుడు…కేశినేని శివనాథ్(చిన్ని) యాక్టివ్ అయ్యారు. మొన్నటివరకు అన్నకు సపోర్ట్ గా నిలిచిన చిన్ని…ఇప్పుడు అన్నతో సంబంధం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు.

దీనిపై కేశినేని బహిరంగంగానే విమర్శలు చేశారు…టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా తన పేరు, హోదాని వాడుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, తాను ఉపయోగించే వి‌ఐ‌పి వాహన స్టిక్కర్ నకిలిదీ వాడుతూ…విజయవాడ, హైదరాబాద్ ల్లో టీఎస్ 07 హెచ్‌డబల్యూ 7777 నెంబర్ గల కారు తిరుగుతుందని కేశినేని…పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే ఆ కారు కేశినేని సోదరుడు చిన్నిది. అయితే కారుని పోలీసులు తనిఖీ చేసి అన్నీ సవ్యంగానే ఉన్నాయని వదిలేశారు.

అంటే తమ్ముడు కారుపైనే కేశినేని కంప్లైంట్ ఇచ్చారు…అంటే వారి మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్లాయో చెప్పాల్సిన పని లేదు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు….వారికి సర్దిచెప్పడం లేదు. అలాగే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేశినేని పోటీ చేస్తారని, తనకు అండగా ఉండాలని కేశినేని సోదరుడుకు చెప్పడం లేదు..దీని బట్టి చూస్తుంటే టీడీపీ అధిష్టానం కేశినేనిని సైడ్ చేసి…ఆయన సోదరుడుని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి టీడీపీలో కేశినేని వ్యవహారం ఎంత దూరం వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news