ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల వేడి చల్లారింది.. అభ్యర్దులు ఖరారు కావడంతో.. ఆశావాహులు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చెయ్యడం.. మరో ఐదు ఖాళీలు ఏర్పడుతూ ఉండటంతో.. వాటి భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు.. ఎవరికి అవకాశం ఇవ్వాలాఅనేదానిపై కసరత్తు ప్రారంభించారు..
ఎమ్మెల్సీ పదవుల కోసం తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. గత ఎన్నికల్లో టిక్కెటె త్యాగం చేసినవారితో పాటు.. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీలుగా పోరాటం చేసినవారు కూడా చంద్రబాబును కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.. ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తమ అభ్యర్దులను ప్రకటించింది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజశేఖర్ , ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల అభ్యర్దిగా మాజీ మంత్రి ఆలపాటి రాజాలను ప్రకటించడంతో వారు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.. పిఠాపురం నుంచి వర్మ, మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమతో పాటు వంగవీటి రాధా, రెడ్డి సుబ్రమణ్యం, గండి వీరాంజనేయులు, ప్రభాకర్ చౌదరి, కొమ్మలపాటి శ్రీధర్ వంటి నేతలకు ఎమ్మెల్సీ పదవులు వచ్చే ఛాన్స్ ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.. అయితే వైసీపీ హయాంలో శాసనమండలిలో గట్టిగా పోరాటం చేసిన వారికి తిరిగి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు.. ఈ జాబితాలో మంతెన సత్యనారాయణ రాజు, బోండా ఉమ, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులున్నారు. వీరు గాక మరింత మంది ఆశావాహులు తమప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ రాజీనామాలు చేసినా ఇంకా ఆమోదం రాలేదు.. అవి ఆమోదం పొందిన తర్వాత వాటిని కూడా భర్తీ చెయ్యాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారట.. జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ అవ్వడంతో.. మిగిలిన స్తానాలకు ఎవరిని ఎంపిక చెయ్యాలా అనేదానిపై సీనియర్లతో చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.