ఇంతకు మించిన ఆత్మవంచన మాట మరొకటి ఉంటుందా బాబు?

-

తెలంగాణలో టీడీపీ ఉందా? అంటే… ఉంది! లేదా? అంటే లేదు! తెలుగుదేశం పార్టీ జాతీయపార్టీ అనే మాట ఎంతవరకూ సరైనదో.. తెలంగాణలో టీడీపీ ఉంది అనేదీ అంతే సరైంది! ఎందుకంటే… తెలంగాణలో టీడీపీని చంద్రబాబు ఎప్పుడో వదిలేశారు. రేవంత్ రెడ్డి హస్తం చేతుల్లోకి వెళ్లిపోయాక.. తెలంగాణలో ఆ పార్టీ తరుపున గట్టిగా మాట్లాడే నాథుడే కరువయ్యాడు. ఇది సగటు టీడీపీ కార్యకర్తకు తెలిసిన విషయం! మరి చంద్రబాబు మాత్రం… తెలంగాణలో టీడీపీని పొగిడేస్తున్నారెందుకు?

Nara-Chandrababu-Naidu
Nara-Chandrababu-Naidu

తాజాగా… ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. టీటీడీపీ పనితీరు బాగుందని ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం తెలంగాణ శాఖ యాక్టివ్‌ గా పనిచేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ నిజంగా ఉండి ఉంటే… బాబు చెప్తున్నట్లు యాక్టివ్ గా ఉండి ఉంటే… కదలికలు ఏవి? కేసీఆర్ పాలనపై ప్రశ్నలు ఏవి?

తెలంగాణలో సమస్యలు అస్సలు లేవని టీడీపీ పోరాటాలు చేయడంలేదా? కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ఇంతకాలం మౌనంగా ఉన్నారా? లేక జనాలు గ్రహించడం లేదని.. తెలంగాణలో టీడీపీ అద్భుతంగా పనిచేస్తుందని ఆత్మవంచన మాటలు మాట్లాడుకుంటున్నారా? చంద్రబాబుకే తెలియాలి!

ఇకనుంచైనా చంద్రబాబు ఇలాంటి ఆత్మవంచన మాటలు మానుకోవాలి! తెలంగాణలో కూడా టీడీపీ కార్యకర్తను ప్రోత్సహించాలి. అవసరమైతే ఏపీని చినబాబుకు వదిలేసి.. తెలంగాణలో టీడీపీని బ్రతికించే పనులకు పూనుకోవాలి. జాతీయపార్టీ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ చేయాలి. అంతే కానీ ఇలా వెంటిలేటర్ పై ఉన్న పార్టీని పట్టుకుని.. అద్భుతహ అని పొగడటం వల్ల ప్రయోజనం శూన్యం. అలాంటిపనులవల్ల కార్యకర్తలను వంచించడమే కాదు.. తనకు తాను ఆత్మవంచన చేసుకున్నట్లు లెక్క!

కేసీఆర్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై స్పందించాలి.. ప్రశ్నించాలి.. పోరాడాలి. అంతేతప్ప… కేసీఆర్ సర్కార్ ని పల్లెత్తి ఒకమాట కూడా అనలేని అచేతనస్థితికి వెళ్లిపోకూడదు. ఇవన్నీ ఆలోచించుకుని అడుగు ముందుకేస్తే ఫలితం ఉంటుంది తప్ప… మీటింగుల్లో ఆత్మవంచన మాటల వల్ల సగటు కార్యకర్తకు ఒరిగేది ఏమీ ఉండదు! వారు కూడా ఒకరొకరు చేయిదాటిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news