కరకట్ట నివాసం కూల్చేస్తే.. చంద్రబాబుకే మైలేజీ వస్తుందా..?

-

కృష్ణానది కరకట్టపైనున్న చంద్రబాబు నివాసం కూల్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెండోసారి కూడా నోటీసులు ఇచ్చినందువల్ల వారంలో కూల్చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే పాతూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి నివాసంలో కూల్చివేతలు ప్రారంభించారు. మరి చంద్రబాబు ఎందుకు ఇంకా ఆ ఇంట్లో ఉంటున్నారు.. కూల్చి వేత జరిగే వరకూ ఆయన అక్కడే ఉండేలా కనిపిస్తున్నారు.

జగన్ సర్కారు తాను అద్దెకు ఉంటున్న నివాసం కూల్చేస్తే అది తనకే రాజకీయంగా లాభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీని ద్వారా కావలసినంత రాజకీయం చేసి.. సానుభూతి సంపాదించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం కూల్చి వేత ఖాయమంటూ చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు.

సీఆర్‌డీఏ పరిధిలని అన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి బొత్స మండిపడ్డారు. కృష్ణానదిలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరకట్టలోపల ఉన్న అక్రమ నిర్మాణాలకు గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు.

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇల్లు అక్రమ నిర్మాణమేనని గతంలో చందరబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు. ఆ రోజు ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చారని అంగీకరించారన్నారు. ఇప్పుడేమో దానిపై చంద్రబాబు మాట మారుస్తున్నారన్నారు. కోర్టు సూచనలతోనే ఇప్పుడు చర్యలు తీసుకుంటామని, పాతూరి కోటేశ్వరరావు భవనంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని మంత్రి వివరించారు. లింగమనేని ఇంటికి కూడా నోటీసులు ఇచ్చామన్నారు. చట్ట ప్రకారం అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తామన్నారు. మొత్తానికి ఈ కరకట్ట ఇంటి వివాదం అనేక రాజకీయ మలుపులు తిరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news