గోదావ‌రి- పెన్నా అనుసంధానం

-

  • ఈ నెల 26న సీఎం చంద్ర‌బాబుతో భూమిపూజ‌

Chandrababu Plans to Godavari-Penna Rivers Interlinking

అమ‌రావ‌తి : గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు తొలగుతాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అనుసంధానం మొదటి దశ పనులు ప్రారంభించేందుకు ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నకరికల్లు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను మంత్రి దేవినేని స్పీక‌ర్ కోడెల‌తో క‌లిసి పరిశీలించారు. నకరికల్లు ఎన్నెస్పీ కాలనీలో విలేకర్లతో మంత్రి దేవినేని మాట్లాడారు. 56.35 కిలోమీటర్ల కాలువ ద్వారా 10.25 కిలోమీటర్ల పైపులైన్లతో ఐదు పంపుహౌస్‌ల నిర్మాణంతో పథకం మొదటి దశ ఉంటుందన్నారు. ఇందుకోసం 3,541 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు.

70 టీఎంసీలు అందించాలని..
గోదావరి నీటిని 500 అడుగుల ఎత్తుకు లిఫ్ట్‌ చేసి నాగార్జునసాగర్‌ కుడి కాలువలో వదులుతామన్నారు. లిఫ్ట్‌ ద్వారా రోజుకు 7 వేల క్యూసెక్కుల చొప్పున 100 రోజుల పాటు 70 టీఎంసీల నీరు అందించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రూ.6,020 కోట్లతో టెండరు పిలిచామని రెండు కంపెనీల భాగస్వామ్యంతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.

9.61లక్షల ఎకరాలకు సాగునీరు
ఈ పథకంతో గుంటూరు జిల్లాలోని 39 మండలాల్లో 5.12 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలోని 40 మండలాల పరిధిలోని 4.49 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ రాకముందు తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా తర్వాత స్థానంలో ఉన్న కృష్ణా జిల్లా ప్రస్తుతం దేశంలోనే హరియాణా తర్వాత రెండో స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, సీఈలు సతీష్‌ కుమార్‌, గోపాలరెడ్డి, ఎస్‌ఈలు బాబూరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news