ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. సోమవారం కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి దాన్ని శాసన సభలో ప్రవేశ పెట్టి ఆమోదింప చెయ్యాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన దీనిపై పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చేసారు. మండలికి 60 కోట్లు ఖర్చు అనవసరమని, అసెంబ్లీలోనే లాయర్లు, డాక్టర్లు, రైతులు ఉన్నారని చెప్పారు.
ఇక మండలి అవసరం ఏమి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో గురువారం శాసన సభలో సుధీర్గ చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రకటన చేసి సోమవారం చర్చిద్దామని చెప్పారు. ఈ నేపధ్యంలో విపక్ష తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయింది. మండలి రద్దు చేస్తే చట్ట సభల్లో ఆ పార్టీ బలం తగ్గిపోయే ప్రమాదం ఉంది. శాసన సభలో 23 మంది ఉండగా మండలిలో 28 మంది టీడీపీకి ఉన్నారు.
దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. అసలు మండలి రద్దు అయ్యే అవకాశం లేదన్నారు. మండలి రద్దు చేసే అంత సీన్ లేదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సరే, అందుకు కేంద్రం అంగీకరించే అవకాశమే లేదని, ఈ విషయంలో ఎమ్మెల్సీలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. శాసన మండలి రద్దు చేసినా సరే తాము అధికారంలోకి వచ్చిన తర్వాతా మళ్ళీ పునరుద్దరిస్తామని స్పష్టం చేసారు.