హుజూరాబాద్ వార్: మారుతున్న టీఆర్ఎస్ స్ట్రాటజీ…

హుజూరాబాద్ ఉపఎన్నికలో సత్తా చాటడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ ( Trs Party ) ముందుకెళుతుంది. అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది. అయితే మొన్నటివరకు ఈటలపై టీఆర్ఎస్ అగ్రనాయకత్వం పెద్దగా విమర్శలు చేయలేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ఈటలపై విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే హుజూరాబాద్ బరిలో ఈటలని ఓడించడానికి టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి పనిచేస్తున్నారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

కానీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రం ఈటల రాజేందర్ పై దూకుడుగా మాత్రం విమర్శలు చేయలేదు. హుజూరాబాద్ పోరు విషయంలో ప్రత్యక్షంగా ఎంటర్ కాలేదు. మొదట్లో ఒకసారి హరీష్ రావు, ఈటల తనపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప పోరుకు సమయం దగ్గరపడటం. అటు ఈటల, బీజేపీ నేతలు కేంద్ర అగ్రనాయకత్వాన్ని హుజూరాబాద్ ప్రచారంలోకి దింపాలని చూస్తున్న క్రమంలోనే టీఆర్ఎస్ స్ట్రాటజీ మార్చి ముందుకొస్తుంది.

ఇప్పటివరకు ఈటల గురించి మాట్లాడని కేటీఆర్, తాజాగా స్పందిస్తూ ఈటలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈటలకు కేసీఆర్ ఎంతో చేశారని, అలాగే టీఆర్ఎస్ ద్వారా లబ్ది పొంది, ఇప్పుడు అదే పార్టీపై ఈటల విమర్శలు చేయడం తగదని అన్నారు. మొదట నుంచి హుజూరాబాద్ టీఆర్ఎస్‌కు కంచుకోట అని, అక్కడ బీజేపీకి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఎంట్రీ ఇచ్చి, ఈటలకు కేసీఆర్ అన్నం పెట్టి, రాజకీయంగా ఓనమాలు నేర్పించారని, కేసీఆర్ బతికి ఉండగానే ఈటల రాజేందర్ సీఎం కావాలని ప్రయత్నాలు చేశారన్నారు. రైతుబంధు దండగ అని.. కళ్యాణలక్ష్మి పథకంతో ఒరిగింది ఏమీ లేదని మాట్లాడితే ..కేసీఆర్ గుండెకు ఎంత గాయం అయ్యిందో ఈటల అర్ధం చేసుకోవాలన్నారు. ఇలా వరుసపెట్టి కేటీఆర్, హరీష్‌లు ఈటలని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్, ఈటల మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.