అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఏపీ అసెంబ్లీకలతోపాటు అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి పాలవడంతో ఇప్పుడా పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన విషయం విదితమే. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరి టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వగా, త్వరలో 18 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో మూకుమ్మడిగా చేరుతారని ఇప్పుడా రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ కో ఇన్‌చార్జి, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీని వీడగా, త్వరలోనే టీడీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారు తమతో టచ్‌లో ఉన్నారని సునీల్ దేవధర్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. అయితే పార్టీని నేతలు వీడకుండా ఉండేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. అందుకే టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని అన్నారు.
ఇక చంద్రబాబు ఓటుకు నోటు, అవినీతి కేసుల్లో త్వరలోనే అరెస్టు అయి జైలుకు కూడా వెళ్తారని సునీల్ అన్నారు. చంద్రబాబు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే వారు బీజేపీలో చేరుతారని ఆయన అన్నారు. దీంతో టీడీపీ త్వరలో ఖాళీ అవుతుందన్నారు. అయితే సునీల్ వ్యాఖ్యలతో ఇప్పుడు చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయన పార్టీకి మరింత నష్టం కలగకుండా ఉండేందుకు అందరితో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మరోవైపు టీడీపీ ఖాళీ అయితే ఆ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ముందు ఎలా వ్యవహరిస్తాన్నది ఆసక్తికరంగా మారింది. మరి టీడీపీ ఎమ్మెల్యేలు 18 మంది నిజంగానే బీజేపీలో చేరుతారా, లేదా.. అన్నది.. మరికొద్ది రోజులు వేచి చూస్తే తేలనుంది.