ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ…

అమరావతి : ఏపీలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో కరోనా కట్టడికి జగన్‌ సర్కార్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే… కరోనా నేపథ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ప్రైవేటు హాస్పిటళ్ళ ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగడం లేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు సీఎం జగన్‌. జూన్ 21 నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లో 25 శాతం కోటాను ప్రైవేటు హాస్పిటళ్ళకు కేటాయించింది కేంద్రం. అయితే ప్రైవేటు హాస్పిటళ్ళ ద్వారా వ్యాక్సినేషన్ కు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.


రాష్ట్రంలో ఇప్పటి వరకు 2, 67,075 మంది మాత్రమే ప్రైవేటు హాస్పిటళ్ళ ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నారని లేఖలో స్పష్టం చేశారు. జూలై నెలలో 17,71,580 డోసులను ప్రైవేటు హాస్పిటళ్ళకు కేటాయించింది కేంద్రం… అయితే.. త్వరగా అందరికీ వ్యాక్సిన్ వేయాల్సిన ఉన్న నేపథ్యంలో ప్రైవేటు హాస్పిటళ్ళల్లోని మిగులు డోసులను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీకి అవకాశం కల్పించాలని జగన్‌ డిమాండ్ చేశారు. ఇప్పటికే కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.