హుజూరాబాద్ ఉపపోరులో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etela Rajender ) కు చెక్ పెట్టడానికి కేసీఆర్ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో బలంగా ఉన్న నాయకులని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వారిని పార్టీలోకి తీసుకున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణని సైతం పార్టీలో చేర్చుకున్నారు.
అలాగే హుజూరాబాద్‌లో వేల కోట్లతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈటల రాజేందర్‌కు ఎలాగోలా చెక్ పెట్టేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉపఎన్నికని మరికొంత కాలం వాయిదా వేయించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చెప్పి, ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి బదులుగా ఎన్నికల నిర్వహణ ఇప్పటిలో సాధ్యం కాదని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి బదులిచ్చింది.
ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి వాయిదా వేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలనే వాయిదా వేస్తే, హుజూరాబాద్ ఉపఎన్నికని కూడా వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పైగా ఎంత వాయిదా వస్తే అంతలా టీఆర్ఎస్‌కు లబ్ది చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువగా హుజూరాబాద్‌లో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేసీఆర్‌కు సమయం దొరుకుంటుంది. అలాగే సమయం గడిచే కొద్ది ఈటలపై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్నికలు వాయిదా పడితేనే టీఆర్ఎస్‌కు బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు. మరి కేసీఆర్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.