తెలంగాణలో మంత్రులు కయ్యాలకు దిగుతున్నారా? కేసీఆర్‌కు తలనొప్పిగా పరిణమించనున్నారా? టీఆ ర్ ఎస్ అధినేత ఎంతో వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షాలకు చెక్ పెడుతూ.. తీసుకున్న నిర్ణయాలను వీరు అప హాస్యం చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్‌లో మంత్రి పదవులపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ.. కొందరికి కేసీఆర్ బెర్త్‌లను రిజర్వ్ చేశారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఎంతమంది పోటీలో ఉన్నా.. తన నిర్ణయం ప్రకారం ఆయన నడుచుకున్నారు. ఇలా కేసీఆర్ వ్యూహంలో భాగంగా రెండో సారి కూడా మంత్రి పదవిని దక్కించుకున్న నాయకుడు ఈటల రాజేందర్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏర్పాటు చేసుకున్న తన టీంలో ఆదిలోనే బెర్త్‌ను పొందారు ఈటల. ఇక, ఇటీవల మరోసారి మంత్రి వర్గాన్ని విస్తరించిన కేసీఆర్ మరో కీలక నాయకులకు అవకాశం కల్పించారు. వీరిలో గంగుల కమలాకర్ ఒకరు. అయితే, ఇలా మరోసారి మంత్రి వర్గం విస్తరించడం, ఒకే జిల్లాకు చెందిన వారికి అవకాశం ఇవ్వడం వెనుక కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి చెక్ పెట్టేందుకు ఆయన వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇలా కీలక నేతలను మంత్రులను చేయడం ద్వారా జిల్లాలో అభివృద్ధి జరగడంతోపాటు బీజేపీకి చెక్ పడుతుందని అనుకున్నారు. అయితే, మొత్తం సీన్ మాత్రం రివర్స్ అయింది. మంత్రులు గంగుల, ఈటల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు సొంత పార్టీ నాయకులే ప్రయత్నించారని ఆరోపిస్తున్న ఈటల ఈ నేపథ్యంలోనే గంగులతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇక, గంగుల పైకి మాత్రం తనకు ఈటలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం ఈటలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రాజకీయ మంటలు రగులుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే, అవి ఎప్పుడు బయట పడతాయో చూడాలి.