మొత్తానికి తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికతో ఎర్ర జెండా పార్టీల దశ తిరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగయ్యే స్థితికి వచ్చిన సిపిఐ, సిపిఎం పార్టీల దశ ఇప్పుడు మారుతుంది. నిజానికి టిఆర్‌ఎస్ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్ధకం అయింది. టిడిపి, కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ సైతం దెబ్బతింది. దీంతో అనూహ్యంగా బిజేపి పుంజుకుంది. ఇప్పుడు బిజేపితో టిఆర్‌ఎస్‌కు ముప్పు వచ్చింది.
ఇక మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న కేసిఆర్..అనూహ్యంగా కమ్యూనిస్టులని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు బలం ఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులని అభిమానించే వారు ఉన్నారు. కాకపోతే వారికి గెలిచే ఛాన్స్ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కలిసి పోటీ చేసి దెబ్బతిన్నారు. దీంతో కమ్యూనిస్టులు పని అయిపోయిందనుకునే సమయంలో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో బిజేపి నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో అక్కడ కాస్త బలం ఉన్న కమ్యూనిస్టులతో టిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంది.
ఒకవేళ ఆ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిస్తే కమ్యూనిస్టుల అవసరం పెద్దగా ఉండేది కాదు. కానీ టిఆర్‌ఎస్ గెలిచింది 10 వేల ఓట్లు, అంటే కమ్యూనిస్టులకు ఉండే 15-20 వేల ఓట్లే టిఆర్‌ఎస్ కు ప్లస్ అయ్యాయి. దీంతో టిఆర్‌ఎస్ గెలుపు సాధ్యమైంది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులతో ఇంకా పొత్తు కొనసాగించాలని కేసిఆర్ భావిస్తున్నారు.
ఇదే క్రమంలో 15న జరగబోయే టిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో…కేసిఆర్ కమ్యూనిస్టులతో పొత్తు గురించి ఇంకా క్లారిటీ ఇచ్చేలా ఉన్నారు. పైగా దేశ రాజకీయాల్లో కూడా కేసిఆర్ వెళ్లనున్నారు కాబట్టి, కమ్యూనిస్టుల అవసరం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ, సిపిఎం లతో కలిసి ముందుకెళ్లడానికి కేసిఆర్ రెడీ అవుతున్నారు.
అయితే కమ్యూనిస్టులకు సీట్ల పంపకాలపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే రెండు పార్టీలకు నాలుగు సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కొత్తగూడెం, పాలేరు, హుస్నాబాద్, మిర్యాలగూడ లాంటి సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సీట్లు టిఆర్‌ఎస్ సిట్టింగ్ సీట్లు, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కమ్యూనిస్టుల కోసం త్యాగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో పాలేరు సీటు కోసం తుమ్మల నాగేశ్వరరావు ట్రై చేస్తున్నారు.
ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా ఉపేందర్ రెడ్డి ఉన్నారు…ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్‌ఎస్ లోకి వచ్చారు. మరి అలాంటప్పుడు ఈ సీటు కమ్యూనిస్టులకు ఇస్తారా? లేదా? అనేది చూడాలి.