మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్యకర్తలకే కాదు పెద్దపెద్ద నాయకులకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం కూడా ఉంది. వైఎస్ఆర్ 13వ వర్ధంతి నాడు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రైతే రాజేతై’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పార్టీ ప్రముఖుల సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అయితే వైఎస్ఆర్ జ్ఞాపకాలతో అచ్చువేయబడిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వైఎస్ కుటుంబాన్ని దూరంగా ఉంచడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవున్నాయి.
రాజశేఖర్ రెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలతో పాటు వైఎస్ పై అభిమానం ఉన్న వారిని పార్టీలకు అతీతంగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా హాజరయ్యారు. అయితే వైఎస్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హాజరవడం విషయం పక్కన పెడితే కనీసం ఆహ్వానం అయినా పంపించారా ? అన్నదే ప్రశ్న. ఒకవేళ ఆహ్వానం పంపించి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వైఎస్ సతీమణి విజయమ్మకుగానీ, షర్మిలకు గానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇటీవలే షర్మిల ఢిల్లీలో సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు కూడా. మరి షర్మిలనైనా పిలవకపోవడానికి గల కారణమేంటో అర్దం కాని విషయం.
వైఎస్ఆర్ మరణానంతరం రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పక్కన పెట్టేసింది. దీంతో సొంతంగా పార్టీ పెట్టుకుని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ తో విభేధాలున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ జగన్ ని ‘రైతే రాజేతై’ పుస్తకావిష్కరణకు పిలవలేదనుకోవచ్చు. కానీ విజయమ్మను పిలవడానికి ఏమైంది ? తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల.. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణలో కాలుకి బలపం కట్టుకుని మరీ తిరిగింది. ఇటీవలే సోనియా, రాహుల్ తో సమావేశమైన ఆమె, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా సిద్ధమైంది. రేపో, మాపో ఇది కూడా లాంఛనంగా జరగనుంది. పార్టీని విలీనం చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగే ఇన్నింగ్స్ మొదలుపెట్టనుంది. ఇలాంటి సమయంలో షర్మిలను కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పిలవకపోవడం వైఎస్ఆర్ అభిమానులను కలిచివేస్తోంది.