మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికిత్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే వారి వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. మండలాల వారిగా ఇంఛార్జ్ లను నియమిస్తూ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికపై కాంగ్రెస్ మాత్రం పెద్దగా హడావుడి చేయడం లేదు.
అయితే టీపీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం జరిగిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఈ ఉపఎన్నికను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలవాలంటే టీఆర్ఎస్, బీజేపీలను ఢీ కొట్టేందుకు మంచి వ్యూహాలను సిద్దం చేయడంతో మంచి అభ్యర్థిని బరిలో ఉంచడం కూడా ఎంతో కీలకం.అయితే గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోండగా… తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మారడంతో హుజురాబాద్ అభ్యర్థి విషయంలో కూడా మార్పు జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ బరిలో నిలవనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ఊహాగానాలను పొన్నం ప్రభాకర్ ఖండించినట్లు తెల్సింది. తనకు హుజురాబాద్ స్థానం నుంచి పోటీ చేయడం ఆసక్తి లేదని పొన్నం తెలిపినట్లు సమాచారం. కాగా కొత్తగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉపఎన్నిక సవాల్ గానే మారనుందని రాజకేయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.