హుజూరాబాద్ వార్: రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా?

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మొన్నటివరకు టీఆర్ఎస్-బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతూ వచ్చాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. అసలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనే ఎక్కువగా తలమునకలై ఉంది. పీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఆ పార్టీలో నెలకొంది.

అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పీఠాన్ని రేవంత్‌కు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. అలాగే త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల రేసులో కూడా కాంగ్రెస్ నిలబడింది. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్-బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిలబడుతుండటంతో ఉపపోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా తయారైంది. అయితే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. ఈయన కూడా ప్రచారం మొదలుపెట్టేశారు.

కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ సీటు విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కౌశిక్ మాత్రం తానే పోటీ చేస్తానని తిరుగుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ని సైతం కలిశారు. కాకపోతే హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డినే ఫైనల్ చేస్తారో లేక వేరే నాయకుడుని నిలబెడుతారో అనే అంశంపై క్లారిటీ రావడం లేదు.

ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉందో అర్ధం కాకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తరుపున ఉన్న కౌశిక్ రెడ్డి, మొన్న ఆ మధ్య కేటీఆర్‌ని కలిసి సంచలనం సృష్టించారు. అసలు కౌశిక్ టీఆర్ఎస్‌లోకి వచ్చి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ పరిణామాలని బట్టి చూస్తే కౌశిక్‌, కాస్త టీఆర్ఎస్‌కు సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అందుకే ఆయన్ని మార్చి వేరే నాయకుడుని హుజూరాబాద్ బరిలో నిలబెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. మరి చూడాలి హుజూరాబాద్ విషయంలో రేవంత్ వ్యూహం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news