అప్పట్లో పోలవరం కాలువల నిర్మాణం జరగకుండా టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ నేతలే మళ్లీ పోలవరం గురించి మాట్లాడుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఈసందర్భంగా చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
బహిరంగ లేఖ రాసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. మంచి పనులు చేసేవాళ్లకు ఎవ్వరూ అడ్డుపడరు. సమీక్షల పేరుతో తన వర్గానికి బిల్లులు క్లియర్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వానికి ఏం సమాధానం చెబుతారు. బిల్లలు ఇప్పుడు క్లియర్ చేసినంతమాత్రాన మీరు బయటపడినట్టు కాదు.
అప్పట్లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వద్దని చంద్రబాబు ఉద్యమం నడిపాడు. మంత్రి ఉమ ఏకంగా కృష్ణా బ్యారేజ్ వద్దే సత్యాగ్రహం చేశాడు. అసలు.. 2014కు ముందు చంద్రబాబు ఏనాడైనా పోలవరాన్ని సందర్శించాడా? చూశాడా? ఆ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చిందే దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం. కేవలం మీవల్ల పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు నిర్ణయం వల్ల రాష్ర్టానికి సుమారు 30 వేల కోట్ల అదనపు భారం పడింది.. అని తెలిపారు.
అప్పట్లో పోలవరం కాలువల నిర్మాణం జరగకుండా టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ నేతలే మళ్లీ పోలవరం గురించి మాట్లాడుతున్నారు. నేను ఇప్పటి వరకు ఆరు సార్లు పోలవరం ప్రాజెక్టును చూసి వచ్చాను. కాలినడకన వెళ్లాను. చంద్రబాబు ఏనాడైనా వెళ్లాడా? రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారా? అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.