టీడీపీలో అభ్యర్థుల మార్పుపై తర్జనభర్జనలు…!

-

ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది టీడీపీ నేతల మాట. అందుకోసం టీడీపీ అధినేత శాయశక్తుల కృషి చేస్తూనే ఉన్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లను కాదని కొత్తవారికి కేటాయించారు చంద్రబాబు. అలాగే పొత్తు కారణంగా కొన్ని నియోజకవర్గాలను బీజేపీ, జనసేనలకు కేటాయించారు. ఇప్పుడు ఇవే చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. వాస్తవానికి జనసేనతో పొత్తు దాదాపు ఏడాది క్రితమే ఖరారైంది. అలాగే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పవన్ అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఎన్ని స్థానాలు, ఏఏ స్ధానాలనే మాట మాత్రం ప్రకటించలేదు. దీంతో కొన్ని చోట్ల అసంతృప్త నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తర్వాత… అనూహ్యంగా అభ్యర్థిని మార్చడంతో నియోజకవర్గంలో నల్లమిల్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు స్వయంగా పిలిచి నల్లమిల్లికి నచ్చజెప్పినప్పటికీ పరిస్థితి మాత్రం సద్దుమణగలేదు.

అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చంద్రబాబుకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులకు సీనియర్లు సహకరించే అవకాశం లేదు. అలాగని అభ్యర్థిని మారిస్తే… ఇప్పుడు ప్రకటించిన నేతలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోవడంం లేదంటున్నారు టీడీపీ పెద్దలు. శ్రీకాకుళం టికెట్ కోసం గుండ లక్ష్మీదేవి గట్టిగా పట్టుబడుతున్నారు. తనను కాదని గోండు శంకర్‌కు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా అంటూ ప్రకటించారు కూడా. ఆమెను చంద్రబాబు హైదరాబాద్ పిలిపించారు. రెండు రోజులు ఆగాల్సిందిగా సూచించారు. అయితే ఇప్పుడు శంకర్‌ను మారిస్తే… ఆయన వర్గం పార్టీని వ్యతిరేకిస్తు.. అలాగని లక్ష్మీదేవిని ఆగమంటే… ఆమె వర్గం వెనక్కి తగ్గటం లేదు. దీంతో ఎటు చూసినా ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక అనపర్తి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అక్కడ టీడీపీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న నల్లమిల్లి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లమిల్లిని బుజ్జగించిన చంద్రబాబు… స్వతంత్రంగా పోటీ చేయమని లోపాయకారిగా చెప్పే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. అదే జరిగితే… కూటమి కట్టుబాటు గంగలో కలిసినట్లే. మరోసారి చంద్రబాబు వైఖరి వైసీపీ నేతలకు అస్త్రంగా మారుతుంది. దీంతో అనపర్తిలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news