గ్రేటర్ లో ఆ ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పరిస్థితి మింగలేక..కక్కలేక అన్నట్టుగా ఉంది.ఇక మొన్నటి ఎన్నికల్లో షాక్ తిన్న ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి ముఖం చాటేసి తిరుగుతున్నారట.. ప్రజల్లోకి రావడానికి కూడా వారికి ముఖం చెల్లడం లేదనే టాక్ ఇప్పుడు సొంత పార్టీలోనే నడుస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకీ దుస్థితి..ఆ ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ స్టార్టయిందా అన్న చర్చ గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

బల్దియా ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు తెరుకోలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు అవుతున్నా.. ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్ అధిష్ఠానానికి కూడా సదరు ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నట్టుగా నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీని వెనక ఉన్న కారణాలు ఆరా తీసేవారు కొందరైతే.. విషయం తెలుసుకుని నివ్వెర పోతున్నవారు మరికొందరు.

నగర పరిధిలోని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, మహమూద్‌ అలీలకు గ్రేటర్ ఎన్నికలు అసంతృప్తినే మిగిల్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోవడంతో మంత్రి సబిత ఇబ్బందిపడుతున్నారట. మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అయితే తన నియోజకవర్గంలో సగం సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజేంద్రనగర్‌ సెగ్మెంట్‌లో ఇంఛార్జ్‌గా వ్యవహరించిన మంత్రి మహమూద్‌ అలీ కూడా బల్దియా సమరంలో చతికిలపడ్డారు. మొత్తం ఐదు డివిజన్లలో ప్రత్యర్థి పార్టీలే గెలిచాయి.

మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ప్రచారం చేసిన డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలోని బాధ్యతలు చూసిన మంత్రి హరీష్‌రావు మాత్రం గులాబీ జెండా రెపరెపలాడించారు. దీంతో గ్రేటర్‌ ఎన్నికలకు మంత్రులకు షాక్‌ ఇవ్వగా.. పలువురు ఎమ్మెల్యేలు ఆ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదని చెబుతున్నారు.

ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న 4 టీఆర్‌ఎస్‌ సీట్లలో ఒకదాన్ని మాత్రమే పార్టీ తిరిగి దక్కించుకోగలిగింది. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య భేతి స్వప్న హబ్సీగూడ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే ఇతర డివిజన్లలో ప్రచారం చేయకపోవడం.. వరదలతో హబ్సీగూడ, రామంతాపూర్, ఉప్పల్‌లోని కాలనీలు మునిగిపోవడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెరసి ఉప్పల్‌ సర్కిల్‌లో టీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది.

మాజీ మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి వారసుడిగా రాంనగర్‌ డివిజన్‌ నుంచి బరిలోకి దిగిన ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డి సైతం ఓడిపోయారు. సీనియర్‌ నేత, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కవాడిగూడ డివిజన్‌లో సక్సెస్‌ కాలేదు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మరదలు పద్మ గాంధీనగర్‌ డివిజన్‌లో పోటీ చేసి గెలవలేకపోయారు. ఈ ఓటమి తెచ్చిన కుంగుబాటో లేక ముఖ్యమంత్రికి ముఖం చూపించలేకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు తెలంగాణ భవన్‌కు ఆఎమ్మెల్యేలు వెళ్లలేదట.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన బంధువుకు టిక్కెట్ ఇప్పించుకుని గెలుపించుకోగా, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తన భార్యకు టిక్కెట్ ఇప్పించుకుని విజయం సాధించారు. అయితే టీఆర్ఎస్‌లో కష్టపడి పని చేసే కార్యకర్తలను కాదని.. ఎమ్మెల్యేలు తమ బంధువులకు ఇప్పించుకుని ఓటమి పాలైయ్యారు. కుటుంబసభ్యులు ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ ముఖ్యనేతలకు.. ఇతర నాయకులతో మాట్లాడేందుకు వారి ముఖం చెల్లటం లేదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఈ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందా లేక కౌంట్ డౌన్ ఇప్పటికే స్టార్టయిందా అనే చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news