అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే ఉన్నా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొన్నది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిశాయి కదా ఇక అభ్యర్థులకు ఏం టెన్షన్ ఉండదు.. ఫలితాలు వచ్చేదాకా వాళ్లు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారా? అస్సలే కాదు. ఎందుకంటే.. అభ్యర్థుల్లో ఇప్పుడు క్రాస్ ఓటింగ్ టెన్షన్ ప్రారంభమైంది. పోలింగ్ శాతం పెరగడం, మహిళలు, వృద్ధులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కూడా అభ్యర్థులను టెన్షన్ పెడుతోందట.
అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే ఉన్నా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొన్నది. వీటిలోని కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. అంటే అసెంబ్లీకి ఒక అభ్యర్థి ఓటేసి.. లోక్‌సభకు ఇంకో అభ్యర్థికి ఓటేయడం అన్నమాట. పార్టీని చూడకుండా.. అభ్యర్థిని చూసి కూడా కొంతమంది ఓట్లేశారట. దీంతో క్రాస్ ఓటింగ్ తమ కొంప ఎక్కడ ముంచుతుందోనని అభ్యర్థులు తెగ ఆందోళనకు గురవుతున్నారని సమాచారం.
ఉదాహరణకు.. ఉత్తరాంధ్రను తీసుకుంటే.. అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందట. క్రాస్ ఓటింగ్ నిజంగానే పడితే మాత్రం ఫలితాలు ఎవ్వరూ ఊహించనట్లుగా ఉంటాయని చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కంటే.. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన మధ్య పోరు ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా క్రాస్ ఓటింగ్స్ పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎంపీ అభ్యర్థుల కంటే అసెంబ్లీ అభ్యర్థులపైనే క్రాస్ ఓటింగ్ ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందో తెలుసుకోవాలంటే మాత్రం మే 23 దాకా ఆగాల్సిందే.