ప్రతిపక్షం..ప్రతిపక్షం కొట్టుకుంటే మధ్యలో అధికార పక్షం లబ్ది పొందుతుందని, కాబట్టి కేసిఆర్ పై పోరాడాల్సిన వారు..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని తాజాగా బిజేపి నాయకురాలు విజయశాంతి…టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు సూచించిన విషయం తెలిసిందే. అయితే వారి మధ్య పోరు…బిజేపి, కాంగ్రెస్ మధ్య పోరుగా మారింది. తాజాగా ఈటల..మునుగోడు ఉపఎన్నికలో కేసిఆర్..కాంగ్రెస్‌కు 25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపణలు చేశారు.
దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు..డబ్బులు ఇచ్చారని నిరూపించాలని, కేసిఆర్, బిఆర్‌ఎస్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని, దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయడానికి రావాలని ఈటలకు..రేవంత్ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రేవంత్ ప్రమాణానికి సిద్ధమవుతుంటే…ఈటల స్పందించలేదు. అయితే ఈటలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ప్రమాణానికి రాకపోతే ఈటల రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరికలు లేవని ఈటల ఫ్రస్టేషన్ లో ఉండి మాట్లాడుతున్నారని, బిజేపికి కేసిఆర్ హైప్ ఇస్తున్నారని అన్నారు.
అయితే ఈటల స్పందించలేదు గాని..సడన్ గా బిజేపి నాయకురాలు డికే అరుణ ఎంట్రీ ఇచ్చి..రేవంత్ పై ఫైర్ అయ్యారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలకు కేసిఆర్ డబ్బులు ఇచ్చారని అందరూ అనుకుంటున్నారని, నిజం చెబితే రేవంత్‌కు అంత రోషం ఎందుకని అన్నారు.
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు రేవంత్ తీరు ఉందని అరుణ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రజలు అనుకుంటున్నారని, గల్లీలో, ఢిల్లీలో లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. మొత్తానికి కాంగ్రెస్, కమలం పార్టీల మధ్య వార్ ముదిరింది.