మంత్రులు మారితే పాల‌న మారిపోద్దా ? దేవుడా !

-

వివాదాస్ప‌ద మంత్రులు ఉంటారా?
ఏమో! బొత్స ఉంటారా ? తెలియ‌దు
అయినా ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో ఎవ‌రికి ఎరుక

ఏపీ క్యాబినెట్లో ఓ కొత్త మార్పు వ‌స్తుంది అని భావించి ముందుకు వెళ్లాలి మ‌నమంతా! ఆ విధంగా బాలినేనిని త‌ప్పిస్తారా లేదా బుగ్గ‌న రాజేంద్ర‌ను త‌ప్పిస్తారా అన్న‌ది ఇప్పుడు పెద్ద చ‌ర్చ. రాష్ట్ర క్యాబినెట్లో అధికారం చెలాయించే మంత్రులు ఎవ్వ‌రూ లేరు అన్న‌ది ఓ వాస్త‌వం. పాల‌న అంతా జ‌గ‌న్ దే! ఆయ‌న చెప్పాక ఇక తిరుగే ఉండ‌దు.ఆయన మాటే శాస‌నం. ఓ విధంగా ఆయ‌న శ‌బ్ద‌మే ఓ శాస‌నం. అవును అందుకే మంత్రులు జ‌గ‌న్ కు ఎదురెళ్లి మాట్లాడ‌రు.మిమ్మ‌ల్ని మారుస్తాను మిమ్మ‌ల్ని తీసేస్తాను అన్న‌వి ఆయ‌న చెప్ప‌రు నేరుగా! కానీ రేప‌టి వేళ మంత్రివ‌ర్గంలో మార్పులు అన్న‌వి త‌థ్యం. కొంద‌రు సీనియ‌ర్లు ఉంటే ఉంటారు.. కొంద‌రు జూనియ‌ర్లు కూడా ఉంటే ఉంటారు. మిగ‌తావాళ్లంతా మంత్రి హోదాతో స‌మానంగా వైసీపీ జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మితులయి త‌మ సామ‌ర్థ్యాన్ని నిరూపించుకున్నాకే మళ్లీ మంత్రులు అవుతారు అన్న‌ది జ‌గ‌న్ మాట. ఆ మాట త్వ‌ర‌లో నెర‌వేర‌నుంది కూడా!

వాస్త‌వానికి జ‌గ‌న్ కు పాల‌న‌పై ఇవాళ్టికీ ప‌ట్టు లేదు.ఆయ‌న చెప్పింది ఒక‌టి.చేస్తున్న‌ది ఇంకొక‌టి.అస‌లు అడ్డూ అదుపూ లేకుండా సంక్షేమం పేరిట అప్పులు తీసుకురావ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ మ‌రే విష‌యంలోనూ లేద‌ని టీడీపీ సైతం విమ‌ర్శ చేస్తున్న‌దీ ఇందుకే! పాద‌యాత్రలో ఇచ్చిన హామీలలో కొన్ని కూడా ఇవాళ నెర‌వేర లేదు అన్న‌ది వాస్త‌వం. ముఖ్యంగా సీపీఎస్ ర‌ద్దు వంటి విష‌యాలపై ఆయ‌న‌కు అస్స‌లు అవ‌గాహ‌నే లేదు.

ఆర్థిక సంబంధ విష‌యాల‌పై ఓ ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తికే అస్స‌లు అవ‌గాహ‌న లేక‌పోతే మంత్రుల‌కు ఏం ఉంటుంద‌ని.? అదేవిధంగా క్యాబినెట్లో మంత్రులెవ్వ‌రికీ అధికారాలు లేవు.ఆయ‌నేం చెబితే అదే చేసి త‌రువాత జీ హుజుర్ సర్ అని అనుకోవ‌డం త‌ప్ప ఎవ్వ‌రూ చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. బొత్స లాంటి సీనియ‌ర్ల‌ను త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు జ‌గ‌న్.ఒక‌వేళ కంటిన్యూ చేసినా మంత్రి హోదాలో ఆయ‌న సాధించేది ఏమీ ఉండ‌దు.

ఆళ్ల నాని, కొడాలి నాని, పేర్ని నాని ఈ ముగ్గురూ త‌ప్పుకునేందుకే ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నార‌ని తెలుస్తోంది.అదేవిధంగా చాలా మంది మంత్రులు త‌మంత‌ట తామే త‌ప్పుకుని కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే కొన్ని ఆదేశాలు ఇచ్చార‌ని కూడా స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అధికారం అంతా సీఎం దగ్గ‌రే దాచుకుని, త‌న గుప్పిట‌లోనే బంధీ చేసుకుని త‌మ‌నెందుకు బ‌లి ప‌శువుల‌ను చేస్తున్నార‌ని కొన్ని సంద‌ర్భాల్లో ప‌లువురు మంత్రులు ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లో ఆవేద‌న చెందారు కూడా! అయినా సీఎం జ‌గ‌న్ తీరు లో మ‌రియు తీర్పులో మార్పే లేదు. రాదు కూడా !

Read more RELATED
Recommended to you

Latest news