గెలిచిన వైసీపీ ఎంపీల మెజారిటీ లెక్కలు తెలుసా…!

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం నమోదు చేసింది.ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి 164 సీట్లను దక్కించుకోగా వైసీపీ కేవలం 11 స్థానాల్లో విజయం సాధించింది.ఇక లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి పైచేయి సాధించింది.మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా అందరూ ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే గత ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాల్ని గెల్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 4 స్థానాలకు పరిమితమైంది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కాయి.

వైసీపీ ఓడినప్పటికీ గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్లో మంచి మెజారిటీలు సాధించారు.ముందుగా కడప పార్లమెంట్ లెక్కలు చూస్తే….ఈ ఎన్నికల్లో మొత్తం 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ది అవినాష్ రెడ్డి 5,97,101 ఓట్లు సాధించి సమీప టీడీపీ అభ్యర్ధి భూపేష్ రెడ్డిపై 65,490 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్ది, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 76,071 ఓట్ల తేడాతో ఓడించారు. రాజంపేట పరిధిలోని రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిధున్ రెడ్డి పట్టు సాధించారు. మొదటిసారి 2014లో అప్పటి బీజేపీ అభ్యర్ధి పురంధరేశ్వరిపై విజయం సాధించారు. 2019లో టీడీపీపై గెలిచారు. ఇప్పుుడు వరుసగా మూడోసారి గెలిచిన మిథున్ రెడ్డి హ్యాట్రిక్ వీరుడయ్యారు.

తిరుపతి నుంచి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మరోసారి విజయం సాధించారు.తన సమీప బీజేపీ అభ్యర్ది వరప్రసాద్‌పై 14,569 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.వైసీపీ అభ్యర్ది గురుమూర్తికి మొత్తం 6,32,228 ఓట్లు లభించాయి.తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచినా ఎంపీగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయాన్ని అందుకున్నారు.ఇక్కడ 15 శాతం మేర క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎస్టీ నియోజకవర్గమైన అరకులో వైసీపీ గెలిచి నిలిచింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిని డాక్టర్ గుమ్మ తనూజా రాణి విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీ సాధించారు. తనూజా రాణికి మొత్తం 4,77,005 ఓట్లు పోలయ్యాయి.మిగతా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడినా ఈ నలుగురు మాత్రం మంచి మెజారిటీతో గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news