బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని దాని వల్లే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలవగలిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలు, వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ కు బలం ఉంటే అధికార పార్టీ హోదాలో ఉండి, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి కూడా రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి, సొంత జిల్లా మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.
తాజాగా మీడియాతో మాట్లాడారు ఈటల. కాంగ్రెస్ ప్రభుత్వ ఇచిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమలు చేసేలా సర్కార్ పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తామెక్కడా చెప్పలేదన్నారు. వాళ్లంతట వారే కొట్లాట పెట్టుకుని, పాలించే సత్తా లేకుండా పోతే మేము ఏం చెప్పలేమన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత నెరవేర్చకుంటే ప్రజలే బండకేసి కొడతారన్నారు. ప్రజలను వంచిస్తే ఏం జరుగుతుందో ఏపీలో ఏం జరిగిందో కళ్లారా చూశామన్నారు. ప్రజలను మోసం చేయాలనుకునే వారు మట్టికరుచుకుపోతారని హెచ్చరించారు.