ములుగులో గెలుపుపై ఎర్రబెల్లి సంచలనం..సీతక్క కౌంటర్.!

-

మొన్నటివరకు ములుగు నియోజకవర్గం గురించి పెద్ద చర్చ లేదు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే సీతక్కకు..ప్రజా మద్ధతు ఎక్కువ. ఆమె ఎలాంటి సమయంలోనైనా ములుగు ప్రజలకు అండగానే నిలుస్తూ వచ్చారు. ఇక రాజకీయంగా కూడా ఆమెకు ఎదురులేని పరిస్తితి. దీంతో ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అన్నట్లు పరిస్తితి ఉండేది.

కానీ కే‌సి‌ఆర్ అనూహ్యంగా..బడే నాగజ్యోతిని ములుగు అభ్యర్ధిగా ప్రకటించారు. నాగజ్యోతి కూడా సీతక్క సామాజికవర్గమే..పైగా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన కుటుంబమే..దీంతో సీతక్కకు జ్యోతి చెక్ పెడుతుందని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ములుగులో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..అక్కడ ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీదే గెలుపు అని ప్రకటించారు.  ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌గా ఉంటుందని, పేదల కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర నాగజ్యోతి కుటుంబానిదని,  అందుకే గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఆమెకు టిక్కెట్‌ కేటాయిస్తున్నారని అన్నారు. సర్వేలన్నీ అనుకూలంగా వచ్చాయని, నాగజ్యోతి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ములుగు టిక్కెట్‌ను చాలామంది ఆశించారని, వారందరికీ అధిష్ఠానం న్యాయం చేస్తుందని తెలిపారు.

ఇక ఎర్రబెల్లి మాటలకు సీతక్క పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తనని ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని, ప్రజాసేవకు- డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ తమ నియోజకవర్గాల మీద ఉండటం లేదని,  ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా అడ్డుకోవడానికి భారీ కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు.

ఇక బీఆర్ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగులో భయాందోళనకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే మంత్రి ఎర్రబెల్లి టార్గెట్ గానే సీతక్క విరుచుకుపడ్డారు. ఇక సీతక్కని బి‌ఆర్‌ఎస్ ఓడించగలదా? లేదా? మళ్ళీ సీతక్క గెలుస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news