ఫరూక్, కిడారి శ్రవణ్‌లతో ప్రమాణం చేయించిన గవర్నర్

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్, ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రమాణస్వీకారం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రజావేదికలో గవర్నర్ నరసింహన్ వీరిచేత ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రులు, పార్టీనేతలు హాజరయ్యారు.
కిడారి శ్రావణ్‌కుమార్ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందారు. 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత ఇలా అవకాశం లభించింది ఈయనకే. ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేకపోయింది. శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు. దీంతో… చట్టసభల్లో సభ్యుడు కాకున్నా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని శ్రావణ్‌కి కల్పిస్తున్నారు. ఈలోగానే సాధారణ ఎన్నికలు వస్తాయి గనుక అరకు నుంచి శ్రావణ్‌నే పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపనున్నారు.
మంత్రులకు శాఖలు ఖరారు..
సివిల్స్‌కు సిద్ధమవుతున్న కిడారి శ్రావణ్ కుమార్ యువకుడు, విద్యావంతుడు కావడంతో ఆయనకు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చి ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారు. తొలుత గిరిజన సంక్షేమం మాత్రమే శ్రావణ్ కు ఇస్తారని ప్రచారం జరగ్గా ఇందుకు విభిన్నంగా చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫరూక్‌కు వైద్య విద్యతో పాటు మైనార్టీ సంక్షేమం కేటాయించారు. నక్కా ఆనంద్ బాబు నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమం శాఖ కిడారికి బదిలి కావడంతో ఆయనకు అదనంగా సినిమాటోగ్రఫీని అప్పగించారు. దీంతో నక్క ఆనంద్ బాబుకు ఇప్పటికే ఉన్న ఎస్సీ సంక్షేమం కోనసాగనుంది.